- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుచుల రాజధానిలో రోగాల ముప్పు.. బ్రాండ్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ
హైదరాబాద్ అనగానే గుబాళించే బిర్యానీలు, నోరూరించే ఇరానీ చాయ్, ఘుమఘుమలాడే హలీమ్ రుచులు గుర్తొస్తాయి.

- ఫుడ్ క్వాలిటీ రేటింగ్‌లో వెనుకబడిన భాగ్యనగరం
- నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ అనగానే గుబాళించే బిర్యానీలు, నోరూరించే ఇరానీ చాయ్, ఘుమఘుమలాడే హలీమ్ రుచులు గుర్తొస్తాయి. గ్లోబల్ ఫుడ్ మ్యాప్ ‘టేస్ట్ అట్లాస్’ జాబితాలో ప్రపంచంలోనే 50వ ఉత్తమ ఆహార నగరంగా నిలిచిన ఘనత మన భాగ్యనగరానిది. కానీ, ఆ రంగుల వెనుక ఇప్పుడు భయంకరమైన రోగాల ముప్పు పొంచి ఉంది. రుచుల రాజధానిగా వెలిగిపోతున్న నగరం.. ప్రస్తుతం ఆహార పరిశుభ్రత (ఫుడ్ హైజీన్) విషయంలో దేశంలోని మెట్రో నగరాల సరసన అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ చేదు నిజాన్ని బట్టబయలు చేశాయి. నాణ్యత కంటే లాభాలే పరమావధిగా భావిస్తున్న కొందరు కేరలెస్ వ్యాపారుల చేతుల్లో చిక్కుకుని.. సిటీ జనం ఆరోగ్యం విలవిల్లాడుతోంది. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ మసకబారుతున్నా.. ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
రేటింగ్‌లో వెనుకబడ్డ భాగ్యనగరం.. మిగతా నగరాల పరిస్థితి ఇదీ!
దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఆహార భద్రతా ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. నగరంలో సుమారు 75,000 ఆహార సంస్థలు నడుస్తుండగా, అందులో కేవలం 25,000 మాత్రమే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కలిగి ఉన్నాయి. ఈ లైసెన్స్ ఉన్న వాటిల్లో కూడా అధికారికంగా పరిశుభ్రత రేటింగ్ (హైజీన్ రేటింగ్) పొందినవి కేవలం 361 (2 శాతం కంటే తక్కువ) మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ 3,394 రేటింగ్ పొందిన సంస్థలతో అగ్రస్థానంలో నిలవగా, ఐటీ హబ్ బెంగళూరు 2,200 సంస్థలతో రెండో స్థానంలో ఉంది. ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాలు సైతం వెయ్యికి పైగా హోటళ్లకు హైజీన్ రేటింగ్స్ ఇప్పించి తమ నగర ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తుంటే.. హైదరాబాద్ మాత్రం కేవలం 361 రేటింగ్స్‌తో దేశంలోనే అత్యంత దారుణమైన స్థానంలో నిలిచింది.
ఫుడ్ సేఫ్టీ నోఅప్‌డేట్.. అధికారులవల్లే ఈ దుస్థితి!
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం ‘సీజనల్’ గానే దాడులు చేస్తుంటారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్పటికప్పుడు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్‌పై చేసే దాడుల వివరాలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అధికారిక ఎక్స్ ఖాతా (@cfs_telangana)లో వెల్లడించేవారు. మీడియాకు కనీసం అధికారిక రిపోర్టులు కూడా ఇవ్వకుండా కేవలం ఈ ఖాతానే సమాచార వనరుగా మార్చారు. అయితే, మే 29వ తేదీన నాగోల్‌లోని ఒక నమ్కీన్ తయారీ యూనిట్‌పై దాడి చేసిన వివరాలే ఈ ఖాతాలో చివరి అప్‌డేట్. ఆ తర్వాత నుంచి నేటి వరకు (జూన్ 26) దాదాపు నెల రోజులుగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్ ఖాతాలో ఎలాంటి నూతన సమాచారమూ లేదు, అప్‌డేట్ అంతకన్నా లేదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పూర్తిగా లోపించిందనడానికి అధికారుల ఈ నిమ్మకు నీరెత్తిన తీరే నిదర్శనమని, వారి నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఆహార భద్రత ఇంతలా క్షీణించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరిస్థితి ఇంత ఘోరంగా మారడానికి కారణం ఎవరు?
లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న హోటల్ వ్యాపారుల నిర్లక్ష్యం ఒకవైపయితే, అధికారుల వైఫల్యం మరోవైపు స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో సుమారు 50 వేల సంస్థలు కనీసం లైసెన్స్ లేకుండా చెలామణి అవుతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు లేదా పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే ఆకస్మిక తనిఖీలు చేయడం, ఆ తర్వాత మళ్లీ మామూలే అన్నట్లు వ్యవహరించడం అధికారులకు పరిపాటిగా మారింది. నగరంలోని వేలాది హోటళ్లను తనిఖీ చేయడానికి తగినంత మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేకపోవడం, ఉన్నవారైనా క్షేత్రస్థాయిలో సరిగ్గా పర్యవేక్షించకపోవడం పెద్ద శాపంగా మారింది. నిబంధనలు ఉల్లంఘించిన పెద్ద పెద్ద రెస్టారెంట్లకు కేవలం కొన్ని వేల రూపాయల జరిమానా వేసి చేతులు దులుపుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, మామూళ్ల మత్తు కారణంగా కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతోనే వ్యాపారులు ప్రజల ప్రాణాలతో యథేచ్ఛగా ఆడుకుంటున్నారు. ప్రజలు సైతం హోటళ్లకు వెళ్లినప్పుడు రుచితో పాటు అక్కడ 'ఫుడ్ సేఫ్టీ డిస్‌ప్లే బోర్డ్' ఉందో లేదో తనిఖీ చేయడం, అపరిశుభ్రతపై అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారానే ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాగలరని నిపుణులు సూచిస్తున్నారు.






