ఒకే నగరం.. రెండు ట్యాక్స్‌లు: జీహెచ్‌ఎంసీ విలీనంతో పన్నుల ‘పంచాయితీ’!

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-02 04:54:17  IST  )

జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల విషయంలో అయోమయంలో నెలకొన్న విషయం తెలిసిందే.

ఒకే నగరం.. రెండు ట్యాక్స్‌లు: జీహెచ్‌ఎంసీ విలీనంతో పన్నుల ‘పంచాయితీ’!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల విషయంలో అయోమయంలో నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడంలో అధికారుల్లో గందరగోళం నెలకొన్నదనే చెప్పాలి. జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ వాల్యూ ఆధారంగా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్నారు. విలీనమైన 27 యూఎల్బీల్లో మాత్రం కాపిటల్ వాల్యూ (సబ్ రిజిస్ట్రార్ రేటు) ఆధారంగా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్నారు. అయితే 27 యూఎల్బీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఒకే ప్రాంతంలో రెండు రకాలు ప్రాపర్టీ వసూలు చేయడంపై నగరవాసుల్లో అయోమయం నెలకొన్నది. ఈ విషయంపై మీర్‌పేట్ వాసులు హైకోర్టును ఆశ్రయించారు.

క్యూర్ పరిధిలో ఇలా..

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రికార్డు స్థాయిలో ప్రాపర్టీ కలెక్షన్ వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2558.80 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. అంతకు ముందటి సంవత్సరం (2024-25)లో పాత జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు రూ. 2038.46 కోట్ల ట్యాక్స్ వసూలైంది. గతంతో పొలిస్తే రూ.520 కోట్లు అధికంగా వసూలైంది. నవంబర్ 25వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయటంతో ఇటీవలే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ.2558.80తో అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2024-25)లో కలెక్షన్ అయిన రూ.2038.46తో పోల్చితే తాజాగా సుమారు రూ.520.34 కోట్ల కలెక్షన్ పెరిగింది. పెరిగిన పరిధి కారణంగానే ట్యాక్స్ పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు 27 యూఎల్బీల్లో క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడమూ పెరగడానికి ఓ కారణమని అధికారులు చెబుతున్నారు.

వేర్వేరుగానే..

జీహెచ్ఎంసీ ఏరియాను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) వరకు విస్తరించడంతో ప్రాపర్టీ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఏరియాలో ఒక విధంగా, 27 మున్సిపాలిటీల్లో మరో విధంగా ఉండడంతో అధికారుల్లో అయోమయం నెలకొన్నది. ఇదిలా ఉంటే ప్రాపర్టీ టాక్స్ మార్పులు చేయకుండానే యథావిధిగానే కొనసాగించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇంతకుముందు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సమీప గ్రామాలను విలీనం చేసిన సందర్భంగా ఇలాంటి సమస్య ముందుకొచ్చిందని, అక్కడ రెండు ప్రాంతాల్లో వేర్వేరు విధానాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని పురపాలకశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రాపర్టీ ట్యాక్స్ అధ్యయనం..

జీహెచ్ఎంసీ విస్తరించిన నేపథ్యంలో కొన్ని నూతన విధానాలను అమలు చేయడానికి దేశంలోని ఆయా మెట్రోపాలిటన్ నగరాల్లో జీహెచ్ఎంసీ అధికారులు అధ్యయనం చేశారు. ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ముంబయి, బెంగుళూరు, ఇతర ప్రాంతాల్లో క్యాపిటల్ వాల్యూ (సబ్ రిజిస్ట్రార్ రేటు) వసూలు చేస్తున్నారు. ఈ విధానాలను జీహెచ్ఎంసీ అధికారుల బృందం ఇప్పటికే అధ్యయనం చేయడంతోపాటు దీనికి సంబంధించిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పంపించినట్టు తెలిసింది. విలీనం తర్వాత కొత్తగా విధానాన్ని అమలు చేస్తే జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ ఆదాయం రూ.5వేల కోట్లకు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రజలపై భారాలేయకుండా ఉన్న విధానాల్లో మార్పులు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

కోర్టుకెళ్లిన మీర్‌పేట్ వాసులు..

జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాల్లో బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, కోకాపేట్, మణికొండ,మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాలలో కూడా లేని ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దీనికి విలీన ప్రాంతాల్లో కాపిటల్ వ్యాల్యూ ఆధారంగా ట్యాక్స్ వసూలు చేయడమే కారణం. అదే జీహెచ్ఎంసీ ఏరియాలో రెంటల్ వ్యాల్యూ ఆధారంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మీర్ పేట్, బడంగ్ పేట్ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు మాత్రం ప్రజల ముక్కుపిండి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ఖర్చులో 20% ఆదాయం చూపాల్సిందే.. అప్పుడే వెయ్యి మార్కులు సొంతం!

Next Story