- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్చ్.. మెరవని రోనాల్డ్.. పోర్చుగల్ కు షాకిచ్చిన పసికూన కాంగో
ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) గ్రూప్-కెలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఒక ఊహించని ఫలితం నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్ : ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) గ్రూప్-కెలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఒక ఊహించని ఫలితం నమోదైంది. బలమైన, స్టార్ ఆటగాళ్లతో కూడిన పోర్చుగల్ జట్టును పసికూనగా భావించిన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో జట్టు 1-1 గోల్స్ తేడాతో నిలువరించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న ఈ పోరు, కాంగో ఆటగాళ్ల అసాధారణమైన దూకుడు ఫుట్‌బాల్ అభిమానులకు అసలైన మజాను అందించింది.
సుమారు 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన కాంగో జట్టు, తన పునరాగమన తొలి మ్యాచ్‌లోనే మాజీ ఛాంపియన్ పోర్చుగల్‌కు ముచ్చెమటలు పట్టించి అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పోర్చుగల్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట 6వ నిమిషంలోనే పోర్చుగల్ మిడ్‌ఫీల్డర్ జోవో నెవ్స్ అద్భుతమైన ఫీల్డ్ వర్క్ చేశాడు. సహచర ఆటగాడు పెడ్రో నెటో ఇచ్చిన పాస్ ను నైపుణ్యంగా అందుకున్న నెవ్స్, దానిని హెడర్ ద్వారా గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, పోర్చుగల్ ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ కాంగో డిఫెండర్లు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా ప్రత్యర్థి దాడులను తిప్పికొట్టారు. ఈ క్రమంలోనే తొలి అర్ధభాగం ముగిసే సమయానికి కాంగో స్ట్రైకర్ 'విస్సా' మైదానాన్ని ఒక్కసారిగా ఊపేసాడు. అతను కూడా హెడర్ ద్వారా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమం చేసి పోర్చుగల్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు.
రెండో అర్ధభాగంలో ఇరు జట్లు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డాయి. మైదానంలో 70 శాతానికి పైగా సమయం బంతి పోర్చుగల్ ఆటగాళ్ల ఆధీనంలోనే ఉన్నప్పటికీ, కాంగో డిఫెన్స్ లైన్‌ను దాటి రెండో గోల్ సాధించలేకపోయారు. మ్యాచ్ మొత్తం మీద పోర్చుగల్ ఆటగాళ్లు గోల్ పోస్ట్ దిశగా కేవలం 3 షాట్లు మాత్రమే కొట్టగా, కాంగో ప్లేయర్లు 2 షాట్లు ఆడారు. ఆటలో తీవ్రమైన పోటీ కారణంగా రిఫరీ నలుగురు ఆటగాళ్లకు ఎల్లో కార్డులు (Yellow Cards) జారీ చేయగా, అందులో ముగ్గురు పోర్చుగల్ ఆటగాళ్లే ఉండటం గమనార్హం.






