ఆ విషయంలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్.. ముప్పు తప్పదా!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-19 06:41:59  IST  )

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఆ విషయంలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్.. ముప్పు తప్పదా!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడి వచ్చి స్థిరపడుతున్నారు. దీంతో హైదరాబాద్ నగర జనాభా రోజూరోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. జనసాంద్రత విషయంలో దేశ రాజధాని ఢిల్లీని సైతం మించిపోయింది. ఇది భవిష్యత్తులో పెను సవాళ్లను తీసుకురానుందని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ (ATLAS)-2024 ప్రకారం హైదరాబాద్ నగరంలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు జీవిస్తున్నారు. ఢిల్లీలో చదరపు కిలోమీటరుకు 11,313 మంది జనాభా నివసిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే హైదరాబాద్‌లో జనాభా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. దేశం విషయానికి వస్తే జనసాంద్రతలో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ చదరపు కిలోమీటర్‌కు 28,508 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక హైదరాబాద్ జనాభా సాంద్రత పెరుగుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం జనాభా తగ్గుదల సమస్యలు ఎదుర్కొంటుందని నివేదికలు చెబుతున్నాయి. బిహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాత్రం జనసాంద్రత చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ఒక చదరపు కిలో మీటరుకు కేవలం 312 మంది మాత్రమే నివసిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక మరోవైపు హైదరాబాద్‌లో వృద్ధుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుందని, యువ జనభా తగ్గుదల ఉండనున్నట్లు నివేదికలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జనాభా నియంత్రణ విధానాలను అనుసరించడం వల్ల జననాల రేటు తగ్గిపోవడమే ఇందుకు కారణం. 2031 నాటికి తెలంగాణలో యువ జనాభా తగ్గి, 40 ఏళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నాయి. ముఖ్యంగా 80 ఏళ్లు నిండిన వారి సంఖ్య ఏకంగా 80 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. కాగా, రాష్ట్ర జనాభాలో వచ్చే ఈ మార్పులు.. రాబోయే దశాబ్ధాలలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.

Next Story