హైదరాబాద్ మెట్రోకు దక్కిన అరుదైన గౌరవం.. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం గుర్తింపు

by Ramesh Naini |

హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం, గుర్తింపు లభించింది.

హైదరాబాద్ మెట్రోకు దక్కిన అరుదైన గౌరవం.. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం గుర్తింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Hyderabad Metro) హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం, గుర్తింపు లభించింది. ప్రఖ్యాత (Harvard University) హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించి, హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మెట్రో ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటిగా గుర్తించింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ మెట్రో రైలు ప్రాజెక్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ నేపథ్యంలో మొదట ఎన్నో అడ్డంకులు ఎదుర్కోందని హర్వర్డ్ తెలిపింది. భూసేకరణ, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా నిరసనలు వంటి ప్రధాన సవాళ్లను అధిగమించడంలో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి (Metro MD NVS Reddy) దార్శనిక నాయకత్వాన్ని, వ్యూహాత్మక అమలును ఈ అధ్యయనం ప్రశంసించింది.

మెట్రోను భారతదేశంలోని అత్యుత్తమ మెట్రో వ్యవస్థలలో ఒకటిగా మార్చడానికి కీలకమైన నిర్ణయాలు, పరిపాలన సామర్థ్యం దోహదపడ్డాయి. ఇందుకు అవలంభించిన వ్యూహాలు, రంగాల మధ్య సమన్వయం, ఆధునిక సాంకేతికత, దౌత్యపూరిత చర్చలు వంటి అంశాలు మెట్రో ప్రాజెక్టును ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశాయని హార్వర్డ్ పేర్కొంది. ఈ ప్రాజెక్టులో వినూత్న ఆర్థిక విధానాలు, ఉన్నత ఇంజనీరింగ్ పరిష్కారాలు, సమర్థవంతమైన చర్చల వ్యూహం ద్వారా అవరోధాలను అధిగమించారు. కాగా, ఆవిష్కరణ, దౌత్యం, ఆర్థిక నమూనాకు గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్ట్ నేడు ప్రపంచవ్యాప్తంగా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక బ్లూప్రింట్‌గా పనిచేస్తుంది. ఇది భారతదేశానికి మరో గర్వకారణమైన క్షణం అంటూ హైదరాబాద్ మెట్రోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కేస్ స్టడీని హార్వర్డ్ బిజినెస్ పబ్లిషింగ్ https://hbsp.harvard.edu/product/ISB477-PDF-ENG వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు.

Next Story