ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-25 16:30:53  IST  )

హైద‌రాబాద్ మెట్రో మొద‌టి ద‌శ ప్రాజెక్టు ప్ర‌భుత్వం చేతికి రాబోతుంది. మెట్రో మొద‌టి ద‌శ‌ను కొనుగోలు చేసేందుకు రేవంత్ సర్కార్ అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఎల్ అండ్ టీకి సంబంధించిన రూ.13వేల కోట్ల అప్పుల‌ను టేకోవ‌ర్

ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు
X

దిశ‌, వెబ్ డెస్క్/ తెలంగాణ బ్యూరో: హైద‌రాబాద్ మెట్రో మొద‌టి ద‌శ ప్రాజెక్టు ప్ర‌భుత్వం చేతికి రాబోతుంది. మెట్రో మొద‌టి ద‌శ‌ను కొనుగోలు చేసేందుకు రేవంత్ సర్కార్ అంగీక‌రించింది. ఎల్‌అండ్‌టీకి సంబంధించిన రూ.13వేల కోట్ల అప్పుల‌ను టేకోవ‌ర్ చేసేందుకు ప్ర‌భుత్వం సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. అంతే కాకుండా ఈ ఒప్పందంతో ఎల్‌అండ్‌టీకి రూ.2100 కోట్ల‌ను ప్ర‌భుత్వం చెల్లించ‌నుంది. దీంతో ఇకపై మెట్రో నిర్వ‌హ‌ణ నుండి పూర్తిగా ఎల్‌‌‌అండ్‌టీ త‌ప్పుకోనుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా నష్టాలను భరించలేకపోతున్నామని ఎల్‌అండ్‌టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మెట్రోను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సైతం ఆ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. పదే పదే వెళ్లిపోతామని చెప్పడంతో ప్రభుత్వమే ఆ బాధ్యతలను తీసుకునేందుకు రెడీ అవుతోందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఒప్పందం కుదరడంతో మెట్రో తొలి దశ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం చేతికి వచ్చింది.

రెండో స్థానం నుంచి…

హైదరాబాద్ మెట్రోరైలు 2014లో దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్ లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌, ప్రస్తుతం తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్‌ గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రెండోదశ 2ఏ, 2బీ విస్తరణలో భాగంగా ఎనిమిది కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 163 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన మెట్రో విస్తరణ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నడుస్తున్న మొదటి దశ మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రెండో దశ విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని సూచించింది. అందుకు వీలుగా ఒప్పందం (Definitive Agreement) కావాలని కేంద్రం స్పష్టం చేసింది. రెండో దశలో కూడా ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని సూచించింది. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

రెండో దశలో ఎల్ అండ్ టీ భాగస్వామ్యం…: సీఎం రేవంత్

రెండో దశ మెట్రో లోనూ ఎల్ అండ్ టీ భాగస్వామ్యం పంచుకుంటే బాగుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగినంత ప్రాధాన్యతనిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొదటి దశ, రెండో దశ కారిడార్ల మధ్య సంయుక్త కార్యాచరణకు ఖచ్చితమైన ఒప్పందం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఒప్పందం కుదిరితేనే విస్తరించే రైలు కార్యకలాపాలు సజావుగా సాగుతాయని, ఆదాయ వ్యయాల భాగస్వామ్యంలో స్పష్టత ఉంటుందని సీఎం అన్నారు. రవాణా సంబంధిత వ్యాపారం నుంచి కంపెనీ తప్పుకున్నందువల్ల కంపెనీ ఈక్విటీ భాగస్వామిగా ఉండలేదని ఎల్ అండ్ టీ సీఎండీ స్పష్టం చేశారు. 2022 జులై 22న కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అంగీకరించిన రూ. 3,000 కోట్ల వడ్డీ లేని రుణంలో రూ.2100 కోట్లు బకాయి ఉందని గుర్తు చేశారు. చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశ మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆర్థిక ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, ఆమోదం తొందరగా వచ్చే అవకాశముందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సలహాదారు ఎన్‌వీఎస్‌.రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఎంఏయూడీ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రెటరీ మాణిక్యరాజ్‌, ఎల్ అండ్ టీ గ్రూప్‌ సీఎండీ ఎస్‌ఎన్‌. సుబ్రహ్మణ్యన్‌, సీఎండీ సలహాదారు డీకే సేన్‌, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈఓ కేవీబీ.రెడ్డి హాజరయ్యారు.

అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు..

మెట్రో రైల్ మొదటి దశ రూ.22,148 కోట్ల పెట్టుబడితో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర 57 స్టేషన్లతో నిర్మించారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా రూ.2,970 కోట్లు, భారత ప్రభుత్వం ద్వారా రూ.1,204 కోట్లు, 81శాతం నిధులు రూ.17,974 కోట్లు ప్రైవేట్ రంగ రాయితీ సంస్థ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ పెట్టుబడి పెట్టింది. అయితే మియాపూర్ - ఎల్ బీ నగర్: 29 కి.మీ మార్గంలో 27 స్టేషన్లు, జేబీఎస్-ఎంజీబీఎస్ 11 కి.మీ మార్గంలో 8 స్టేషన్లు, నాగోల్ - రాయదుర్గ్ 29 కి.మీ మార్గంలో 22 స్టేషన్లు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం (పీపీపీ)తో చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్ట్ గా గుర్తింపు కూడా ఉంది. దీన్ని 2017లో ప్రారంభించారు. అయితే హైదరాబాద్ మెట్రోరైలుపై స్టాన్ ఫార్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీ చేయాలని నిర్ణయించింది. అయితే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు అవార్డు పొందిన కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని నిర్ణయించడం గమనార్హం.

మంచి పరిణామం : సీపీఐ(ఎం) నేత ఎం.శ్రీనివాస్

ఎల్ అండ్ టీ నుంచి మెట్రోరైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం మంచి పరిణామం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలు, ఎల్ అండ్ టీ వైఫల్యాలు, ఉల్లంఘనల నేపథ్యంలో ప్రయాణీకులు నష్టపోవాల్సి వచ్చింది. ఒప్పందానికి విరుద్ధంగా ఎల్ అండ్ టీ లేబర్ సెస్ ఎగ్గొట్టింది. చార్జీలు పెంచింది. స్టేషన్ల నిర్మాణంలో కూడా లోపాలున్నాయని కాగ్ మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం కేటాయించిన భూమిని వాణిజ్య కార్యాకలాపాలకు వినియోగించుకోవడంలో ఎల్ అండ్ టీ పూర్తిగా విఫలమైంది. గత ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలేంటి? ఎందుకు చార్జీలు పెంచారు? వంటి అంశాలను బహిర్గతం చేయాలి.

Next Story