- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ మెట్రో విభిన్నం.. ఆదాయం రాబట్టడంలో L&T ఫెయిల్
దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లోని మెట్రో రైలు ప్రాజెక్టుల కంటే హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ భిన్నంగా ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లోని మెట్రో రైలు ప్రాజెక్టుల కంటే హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ భిన్నంగా ఉన్నది. దేశంలోనే పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) విధానంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) విజయవంతంగా 7 ఏండ్లు పూర్తిచేసుకుంది. ఈ విధానంలో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులు ఎక్కడా సక్సెస్ కాలేదు. కానీ హైదరాబాద్‌లో సక్సెస్ అయిందనే చెప్పాలి. బ్యాంకాక్‌లో 35కి.మీ పీపీపీ మోడల్ మెట్రో ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం టేకోవర్ చేసుకుంది. ఢిల్లీలో ఎయిర్ పోర్ట్ మెట్రో రైలు 20కి.మీ.ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ముంబైలో 11కి.మీ మెట్రోదీ ఇదే పరిస్థితి. అయితే హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ అన్ని రకాల వనరులున్నా ఎల్ అండ్ టీ సంస్థ విఫలమైందనే విమర్శలూ లేకపోలేదు. ఎల్ అండ్ టీ సంస్థ చేతులెత్తేయడంతో టేకోవర్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏకైక మెట్రో రైలు ప్రాజెక్టు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ మాత్రమే. ఆ జాబితాలో తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా చేరింది. మిగిలిన అన్ని ప్రాజెక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో..
జైపూర్ మెట్రో రైలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఢిల్లీ, ముంబయి, కల్‌కత్తా, పుణే, నాగ్‌పూర్, బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టులన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల షేరింగ్‌తో నడుస్తున్నాయి. కేంద్రం వాటా 20 శాతం, రాష్ట్రం 20 శాతం, మిగిలిన 60 శాతం నిధులను బ్యాంకు రుణం ద్వారా సమీకరించినట్లు ప్రజారవాణా నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును మాత్రమే పీపీపీ విధానంలో చేపట్టారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును టేకోవర్ చేసుకుంది. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతుల నేపథ్యంలో ఏర్పడిన సందిగ్ధతల నడుమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని పలువురు అధికారులు చెబుతున్నారు.
ఎల్ అండ్ టీ వైఫల్యమే..
మెట్రో రైలు విషయంలో ఎల్ అండ్ టీ తప్పిదాల వల్లనే నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని పలువురు ప్రజారవాణా నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టిన ఎల్ అండ్ టీ 2010లో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మెట్రో రైల్ నిర్వహణకు 45 శాతం ఆదాయం ప్రభుత్వం కేటాయించిన భూములను వ్యాపారంగా మార్చుకోవడం ద్వారా సాధించుకుంటామని పేర్కొన్నది. 50 శాతం టికెట్ రేట్ల ద్వారా, 5 శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా పొందుతామని ఒప్పందంలో రాసుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో 18.5 లక్షల చదరపు అడుగుల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించి వాటి ద్వారా 45 శాతం ఆదాయం రాబట్టుకుంటామని ఎల్ అండ్ టీ చెప్పింది. ఇప్పటివరకు రెండు లక్షల చదరపు అడుగుల్లో మాత్రమే వాణిజ్య సముదాయాలు నిర్మించారు. వారు నిర్ణయించుకున్న లక్ష్యాలు ఏమాత్రం సాధించలేకపోయారు. వాణిజ్యపరంగా లక్ష్యాలు సాధించలేక, మెట్రో రైల్ నిర్వహణలో లోటు ఏర్పడిందని తప్పుడు ప్రచారం చేశారని పలువురు విమర్శిస్తున్నారు. నష్టాలకు బాధ్యత ఎల్ అండ్ టీదే తప్ప ప్రజలది, ప్రభుత్వానిది కాదు.. ప్రజలపై భారం మోపడం సమంజసం కాదని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మియాపూర్ డిపోకు 99 ఎకరాలు, నాగోల్‌లో 96 ఎకరాలు, ఫలక్‌నుమాలో 17 ఎకరాలు, రాయదుర్గంలో 15 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వీటిని అభివృద్ధి చేసి వ్యాపారం చేయడంలో ఎల్ అండ్ టీ సంస్థ విఫలమైందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
అబద్ధాలు ప్రచారం : సెస్ ప్రొఫెసర్ రామచంద్రయ్య
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మొదటి నుంచి ఎల్ అండ్ టీ సంస్థ ఒప్పందాన్ని ఉల్లంగిస్తూనే ఉంది. అబద్ధాలను ప్రచారం చేసింది. అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు అని గొప్పలు చెప్పారు. చివరకు నడిపించలేమని ఎల్ అండ్ టీ చేతులెత్తేసింది. ఒప్పందం ప్రకారం మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు బస్ సర్వీసులు, బైక్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడా దీన్ని అమలు చేయలేదు. దీన్ని అమలు చేయకపోవడంతోనే మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరగడంలేదు. గత ప్రభుత్వంలో మెట్రో రైలును పట్టించుకోలేదు. ఫ్లై ఓవర్లను నిర్మించి ప్రజారవాణా మెరుగుతుందని తప్పుడు ప్రచారం చేశారు. ఆర్టీసీని దివాళా తీయించారు. మెట్రో రైలును ప్రభుత్వం టేకోవర్ చేసుకుందంటే నష్టాలను కూడా చేసుకున్నట్టే. ఇక నుంచి నష్టాలతో నడిపించక తప్పదు. దీన్ని గాడిలో పెట్టాలంటే ఆర్థిక, రాజకీయపరమైన చిక్కులున్నాయి.
చెన్నై కంటే హైదరాబాద్ మెట్రో బెటర్ : ప్రజారవాణా నిపుణులు
చెన్నై మెట్రో రైలు కంటే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు బెటర్. అక్కడ 59 కిలోమీటర్ల మెట్రోలో 2 లక్షల మంది ప్రయాణికులు మాత్రమే జర్నీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో 69 కిలోమీటర్ల మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రాపర్టీ డెవలప్‌మెంట్, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవండంలో ఎల్ అండ్ టీ పూర్తిగా విఫలమైంది.






