ఎనిమిదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న హైదరాబాద్ మెట్రో

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ మెట్రో.. ఎంతో మంది ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగులతో పాటు, విద్యార్థులు, కామన్ పబ్లిక్ అవసరాలను తీరుస్తూ..

ఎనిమిదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న హైదరాబాద్ మెట్రో
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో.. ఎంతో మంది ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగులతో పాటు, విద్యార్థులు, కామన్ పబ్లిక్ అవసరాలను తీరుస్తూ.. వారి మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గా నిలిచింది. ప్రతిరోజూ లక్షలాది మంది ట్రాఫిక్ కష్టాలను తీర్చి.. గమ్య స్థానాలకు చేరుస్తోన్న హైదరాబాద్ మెట్రో.. 8 వసంతాలను పూర్తి చేసుకుని, 9వ వసతంలోకి అడుగు పెట్టనుంది. ఈ ఎనిమిదేళ్లలో మెట్రో, L&T సంస్థకు 205 అవార్డులు లభించాయి.

2012లో పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (PPP) పద్ధతిలో రూ.14,132 కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభమయింది. 2017 నవంబర్ 28న మియాపూర్ టు నాగోల్ వరకు మెట్రోరైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తర్వాత ఎల్ బీ నగర్ - అమీర్ పేట మార్గంలో మెట్రో 2019 మార్చిలో ప్రారంభమైంది. 2020 ఫిబ్రవరి 7న జేబీఎస్ - ఎంజీబీఎస్ రూటులో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెడ్ లైన్ లో మియాపూర్ టు ఎల్ బీ నగర్, బ్లూ లైన్ లో రాయదుర్గ్ టు నాగోల్, గ్రీన్ లైన్ లో జేబీఎస్ టు ఎంజీబీఎస్ స్టేషన్లకు మెట్రో సేవలు కొనసాగుతున్నాయి.

ప్రతిరోజూ మూడు కారిడార్లలో 57 మెట్రో రైళ్లు.. 1100 ట్రిప్పులు తిరుగుతున్నాయి. పాతికవేల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తుండగా.. సగటున రోజుకి 4.5 -5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవల్ని వినియోగించుకుంటున్నారు. నిన్నటి వరకు (నవంబర్ 27) ఎనిమిదేళ్లలో 80 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ మెట్రో రైలు సేవలందిస్తోంది. ఉదయం 8-11 గంటల్లో, సాయంత్రం 6-9 గంటల్లో అయితే మూడు మెట్రో కారిడార్లు ఫుల్లైపోతున్నాయి. ఒక్క కంపార్టుమెంట్లోనూ కాలు పెట్టే పరిస్థితి ఉండట్లేదు.

ఇక ప్రస్తుతం రెండో దశ మెట్రో విస్తరణ కోసం కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోంది. పార్ట్ -ఏ లో 5 కారిడార్లు, పార్ట్-బీ లో 3 కారిడార్లను నిర్మించనుంది. మొత్తం 163 కిలోమీటర్ల మేర రూ.43,848 కోట్ల వ్యయంతో ప్రతిపాదించగా.. ప్రస్తుతం కేంద్రం వద్ద డీపీఆర్ లు పరిశీలనలో ఉన్నాయి. 2026 మార్చిలోగా వాటికి అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ తెలిపింది. ఇది కూడా పూర్తయితే భాగ్యనగరంలో మెట్రో రవాణా వ్యవస్థ మరింత కీలకంగా మారనుంది.

Next Story