అన్ని పండుగలకు వేదిక హైదరాబాద్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-05 07:35:15  IST  )

ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు.

అన్ని పండుగలకు వేదిక హైదరాబాద్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ పూలమాల వేసి హారతిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 71 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహా గణపతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. 69 అడుగుల గణపతి ప్రతిష్టించడం ఆశామాషీ వ్యవహారం కాదని అన్నారు. ఒక కార్యక్రమాన్ని ఒక్కరోజు చేయడమే తలకు మించిన భారమని.. కానీ, అంతటి మహత్కార్యాన్ని భుజాలపై వేసుకున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.

నగరంలో ఎన్ని పెద్ద విగ్రహాలు ప్రతిష్టించినా.. ఖైరతాబాద్ మహా గణపతికి ఉన్న క్రేజే వేరని అన్నారు. ఇవాళ నగరంలో 1,40,000 వేలను ప్రతిష్టించుకున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వినాయక విగ్రహ మండపాలకు తొలిసారి ఉచితంగా విద్యుత్‌ ఇచ్చిన ఘనత తమకే దక్కిందని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. అన్ని పండుగలకు వేదిక హైదరాబాద్ అని.. అన్ని మతాలను గౌరవిస్తూ మన నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను అనునిత్యం జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ, అన్ని శాఖల అధికారులు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భక్తులు పోలీసులకు సంపూర్ణంగా సహకరించి ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగాలన చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Next Story