అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి

by Ramesh Naini |

ఈ నెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్న పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు డీజీపీ తెలిపారు.

అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 74వ బీ.ఎన్. మల్లిక్ మెమోరియల్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్న ఈ క్రీడా సంబరానికి తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు డీజీపీ తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు 46 జట్లు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో ప్రదర్శించనున్న ప్రత్యేక లోగోలను ఖరారు చేశారు. ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ బలగాల నుంచి క్రీడాకారులు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ఈ మెగా టోర్నీ కోసం నగరంలోని ఆరు ప్రధాన మైదానాలను సిద్ధం చేశామని, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, అజీజ్ నగర్‌లోని హెచ్ఎఫ్సీ గొగ్జీస్ స్పోర్ట్స్ ఎరీనా, మొయినాబాద్‌లోని శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ గ్రౌండ్, శివరాంపల్లిలోని జాతీయ పోలీస్ అకాడమీ మైదానం, గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్ గ్రౌండ్, తెలంగాణ పోలీస్ అకాడమీ మైదానాలు ఉన్నాయని తెలిపారు. గచ్చిబౌలి, హెచ్ఎఫ్సీ మైదానాల్లో రాత్రి సమయాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించేందుకు వీలుగా ఫ్లడ్ లైట్ల సౌకర్యం ఉందని డీజీపీ తెలిపారు.

ఏప్రిల్ 5న ముగింపు వేడుకలు

మార్చి 24న టీమ్ మేనేజర్‌ల సమావేశం డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించి, 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలను నిర్వహిస్తామని, తొలి మ్యాచ్ లో తెలంగాణ పోలీస్ జట్టు ఆడుతుందని వెల్లడించారు. పోటీల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఒక ఐపీఎస్ అధికారితో పాటు 13 మంది డీఎస్పీ/అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి అధికారులు, 23 మంది ఇన్‌స్పెక్టర్లు, 35 మంది టీమ్ మేనేజర్లు పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 5న ముగింపు వేడుకలతో ఈ క్రీడా సంబరం ముగుస్తుందని వివరించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఇప్పటి వరకు పురుషుల విభాగంలో 37 జట్లు, మహిళల విభాగంలో 9 జట్లు ముందుకు వచ్చాయని డీజీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, అడిషనల్ డీజీపీలు మహేశ్ ఎం. భగవత్, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ నాయుడు పాల్గొన్నారు.

Next Story