ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హబ్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-26 06:15:45  IST  )

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్‌ను హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హబ్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్‌ హబ్‌ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరో పార్క్ (SEZ)లో సాఫ్రాన్ ఏర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సాఫ్రాన్ ఛైర్మన్ రాస్ మెక్‌ఇన్నెస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్‌ను ఎంచుకున్న సాఫ్రాన్ సంస్థకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

భారత వైమానిక, నావికాదళానికి మేలు..

భారతదేశంలో LEAP ఇంజిన్ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (MRO) సెంటర్ ఇదే కావడం విశేషమని తెలిపారు. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో వెయ్యి మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. సాఫ్రాన్ సంస్థకు చెందిన M88 మిలిటరీ ఇంజిన్ MROకు శంకుస్థాపన చేశామని.. ఇది భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హబ్‌గా మారిందని అన్నారు. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని తెలిపారు. తమ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, SEZలు ప్రముఖ ప్రపంచ కంపెనీల నుంచి అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించాయని అన్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌‌కు రండి..

సాఫ్రాన్, బోయింగ్, ఎయిర్‌బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని పేర్కొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో మన ఎగుమతులు గత ఏడాది రెట్టింపు అయ్యాయని.. 9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ ఏరోస్పేస్ అవార్డును పొందిందని గుర్తు చేశారు. బెంగళూరు-హైదరాబాద్‌ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో తాము భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని అన్నారు. తమ విజన్‌ను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నామని అన్నారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story