అహ్మదాబాద్‌లో హైదరాబాద్ ఈడీ అధికారుల దాడులు..12వేల డాలర్లు క్రిప్టో కరెన్సీ స్వాధీనం

by Ramesh Naini |

అహ్మదాబాద్‌లోని ఆరు ప్రాంతాల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ), హైదరాబాద్ జోనల్ కార్యాలయం విస్తృత సోదాలు నిర్వహించింది.

అహ్మదాబాద్‌లో హైదరాబాద్ ఈడీ అధికారుల దాడులు..12వేల డాలర్లు క్రిప్టో కరెన్సీ స్వాధీనం
X

దిశ,తెలంగాణ బ్యూరో: అహ్మదాబాద్‌లోని ఆరు ప్రాంతాల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ), హైదరాబాద్ జోనల్ కార్యాలయం విస్తృత సోదాలు నిర్వహించింది. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో నడుస్తున్న అక్రమ కాల్ సెంటర్ కార్యకలాపాలపై సైబరాబాద్ పోలీస్, సీబీఐ( ఐవోడి న్యూఢిల్లీ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయ అధికారులు పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు సోమవారం ఈడీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహమ్మద్ అన్సారీ, అకిబ్ ఘాంచీ, వికాస్ నిమార్, దివ్యాంగ్ రావల్, ప్రదీప్ రాథోడ్ తదితరులు కలిసి ఈ నెట్‌వర్క్ నడిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నిందితులు అమెరికా ప్రభుత్వ అధికారులు లేదా కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ బాధితులను బెదిరించి అమెజాన్ గిఫ్ట్ కార్డులు, డిజిటల్ చెల్లింపుల రూపంలో డబ్బు వసూలు చేసినట్లు నిర్ధారించారు.

క్రిప్టో రూపంలో హవాలా

సేకరించిన డబ్బును కొంత భాగం మాత్రమే భారతీయ బ్యాంకింగ్ మార్గాల ద్వారా బదిలీ చేయగా, ఎక్కువ భాగం నగదు క్రిప్టో రూపంలోనే హవాలా మార్గాలు, స్థానిక బ్లాక్ మార్కెట్ ద్వారా మార్పిడి చేసినట్లు తేలింది. సోదాల్లో సుమారు 12,000 డాలర్ల సమానమైన క్రిప్టో, రూ.13.5 లక్షల లెక్కలోలేని నగదు స్వాధీనం చేసుకున్నారు. 31 బ్యాంకు ఖాతాలు, ఒక లాకర్‌ను ఫ్రీజ్ చేశారు. నిందితులు చాలాకాలంగా ఇలాంటి నేరాల్లో పాల్గొంటూ, అక్రమ సంపాదనతో తమ పేర్లతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Next Story