ట్రీటెడ్ వేస్ట్ వాటర్ సర్క్యూలర్ ఎకానమీపై ఫోకస్

by Naga Rani Yarlagadda |

ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన వేస్ట్ వాటర్, మున్సిపల్ సాలీడ్ వేస్ట్ ఆధారిత ఆదాయంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ట్రీటెడ్ వేస్ట్ వాటర్ సర్క్యూలర్ ఎకానమీపై ఫోకస్
X
  • చందనవెల్లి పారిశ్రామికవాడ, ఫ్యూచర్ సిటీకి సరఫరా
  • డీపీఆర్ రూపకల్పనకు జలమండలి కసరత్తు

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన వేస్ట్ వాటర్, మున్సిపల్ సాలీడ్ వేస్ట్ ఆధారిత ఆదాయంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటి ఆధారిత ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి చర్యలు ప్రారంభించింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సర్య్కూలర్ ఎకానమీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీచేసింది. ఇప్పుడు ఎస్టీపీల ద్వారా శుద్ధిచేసిన నీటిని ప్రభుత్వం రంగ సంస్థలు, పరిశ్రమలకు సరఫరా చేయడానికి ఏర్పాటు చేయనున్న పైపులైన్, ఇతర వ్యవస్థలను ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్ తయారు చేసేందుకు జలమండలి కసరత్తు ప్రారంభించింది. అయితే ఎస్టీపీ నీటిని విక్రయించడం ద్వారా జలమండలికి ఆదాయం కూడా వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది రూ.25లక్షల ఆదాయం వస్తే ఈ సారి రూ.85లక్షలకు పెంచినట్టు అధికారులు చెబుతున్నారు.

84ఎస్టీపీలు..2850ఎంఎల్డీ వాటర్

క్యూర్ పరిధిలో రోజుకు 1950మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. అయితే 2027నాటికి 84 ఎస్టీపీల ద్వారా 2850ఎంఎల్డీ వేస్ట్ వాటర్ శుద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022 వరకు 25 ఎస్టీపీల ద్వారా 772ఎంఎల్డీ నీటిని శుద్ధి చేశారు. 2022-25 మధ్యకాలంలో 20ఎస్టీపీల ద్వారా 1106ఎంఎల్డీ వేస్ట్ వాటర్ ట్రీట్ చేస్తున్నారు. అమృత్2.0లో 972ఎంఎల్డీ నీటిని ట్రీట్ చేయడానికి 39ఎస్టీపీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.

ఎస్టీపీ వాటర్ సర్క్యూలర్ ఎకానమీ మోడల్ కోసం డీపీఆర్ తయారు చేయాలని జలమండలి నిర్ణయించింది. పబ్లిక్, ప్రయివేటు పార్ట్ నర్ షిఫ్ (పీపీపీ) విధానంలో ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. అయితే చందనవెల్లిలోని పారిశ్రామికవాడకు ఎస్టీపీ వాటర్ సరఫరా చేయడానికి రూ.2,363కోట్లతో పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వాటర్ ను ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) చుట్టు గార్డెనింగ్, మొక్కలు పెంచడానికి ఎస్టీపీల నీటిని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ఓఆర్ఆర్ చుట్టు పైపులైన్ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా మైక్రోసాప్ట్, అమోజాన్, డేటా సెంటర్లు, వెల్స్ పన్ లతోపాటు చందనవెల్లి పారిశ్రామికవాడ, ఫ్యూచర్ సిటీకి సైతం శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే ఒప్పందాలు..

ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవడానికి పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా దుర్గం చెరువు ఎస్టీపీని నీటిని వినియోగించుకోవడానికి గోల్ఫ్ కోర్సు ముందుకురావడంతోపాటు జలమండలితో ఒప్పందం చేసుకుంది. పటేల్ చెరువు నీటిని వినియోగించుకోవడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు ముందుకొచ్చాయి. అత్తాపూర్ ఎస్టీపీ నీటిని వినియోగించుకోవడానికి మరో కంపెనీ ముందుకొచ్చింది. అయితే ఎస్టీపీ నుంచి కంపెనీ వరకు పైపులైన్ ద్వారా నీటిని అందించాలని కోరినట్టు అధికారులు చెబుతున్నారు. సదురు కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పైపులైన్ వేయడానికి జలమండలి అధికారులు సిద్దంగా ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు కుత్బుల్లాపూర్ పారిశ్రామికవాడలోని కంపెనీలు శివాలయనగర్ ఎస్టీపీ నీటిని వినియోగించుకోవడానికి ముందుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఆ ఎస్టీపీ సైతం పనిలోకి రావడంతోపాటు కంపెనీలకు శుద్ధిచేసిన నీటిని అందించనున్నంది. అయితే ఈ ఏడాదిలో మురుగునీటిని శుద్ధిచేసిన తర్వాత వచ్చే నీటిని విక్రయించడం ద్వారా ఏడాదిలో సుమారు రూ.85లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దీన్ని మరింత పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.

Next Story