ప్రీ-క్లినికల్ రీసెర్చ్‌లో సరికొత్త విప్లవం.. గ్లోబల్ రీసెర్చ్ హబ్‌గా హైదరాబాద్

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ గ్లోబల్ రీసెర్చ్ హబ్ గా మారనుంది. ప్రీ క్లినికల్ రీసెర్చ్ లో సరికొత్త విప్లవం మొదలుకానుంది.

ప్రీ-క్లినికల్ రీసెర్చ్‌లో సరికొత్త విప్లవం.. గ్లోబల్ రీసెర్చ్ హబ్‌గా హైదరాబాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ వైద్య పరిశోధన రంగం మరో మైలురాయిని అధిగమించింది. దేశీయంగా ఔషధ ఆవిష్కరణలు, వ్యాక్సిన్ల తయారీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ప్రపంచ స్థాయి వసతులతో ఉన్న నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్) స్వరూపాన్ని పూర్తిగా మారుస్తూ, దానిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రీ-క్లినికల్ రీసెర్చ్ (ఎన్ఐపీసీఆర్) గా నామకరణం చేసింది. 2026 మార్చి 20 నుంచి ఈ నూతన వ్యవస్థ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.

దేశంలోనే ఫస్ట్

గతంలో ఈ సంస్థ ప్రధానంగా పరిశోధనల కోసం ప్రయోగశాల జంతువులను (ల్యాబరేటరీ యానిమల్స్) సరఫరా చేసే కేంద్రంగానే పరిగణించబడేది. అయితే మారిన కాలానికి అనుగుణంగా కేవలం సరఫరాకే పరిమితం కాకుండా... ఔషధాల తయారీలో అత్యంత కీలకమైన ప్రీ-క్లినికల్ దశకు దీనిని చిరునామాగా మార్చారు. అంటే.. ఏదైనా కొత్త మందు లేదా టీకాను మనుషులపై ప్రయోగించే (క్లినికల్ ట్రయల్స్) ముందు నిర్వహించే అత్యంత క్లిష్టమైన శాస్త్రీయ పరీక్షలు ఇకపై ఇక్కడ జరగనున్నాయి. ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు కావడం దేశంలోనే ఇది ప్రప్రథమం.

ప్రీ-క్లినికల్ ప్రయోగాలు

పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ ఎన్ఐపీసీఆర్ రెండు అత్యాధునిక మార్గాల్లో తన పరిశోధనలను ముందుకు తీసుకెళ్లనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన జంతువుల (అధునాతన యానిమల్ మోడల్స్)పై శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి, ఔషధాల సామర్థ్యాన్ని లెక్కించనున్నారు. జంతువులపైనే కాకుండా, నేరుగా కణజాలాలు, కృత్రిమంగా సృష్టించిన సూక్ష్మ అవయవ నమూనాల (ఆర్గనాయిడ్స్)పై ప్రయోగాలు చేయనున్నారు. దీనివల్ల ఫలితాలు మరింత ఖచ్చితంగా రావడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది.

ప్రయోజనాలు

ఈ సంస్థ ఏర్పాటుతో భారత వైద్య రంగానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. గతంలో ప్రీ-క్లినికల్ ప్రయోగాల కోసం మన ఫార్మా కంపెనీలు, స్టార్టప్‌లు విదేశీ ల్యాబ్‌లపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఖర్చు తగ్గడంతో పాటు భారీగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. ఒక ఔషధం మార్కెట్లోకి రావడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా మహమ్మారుల సమయంలో టీకాల తయారీకి ఇది వెన్నెముకగా మారుతుంది. ఫలితంగా వేగవంతమైన ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. విద్యా సంస్థలు, చిన్న స్థాయి అంకుర సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలను, నిపుణుల మార్గదర్శకత్వాన్ని ఎన్ఐపీసీఆర్ అందిస్తుంది. క్యాన్సర్, జన్యుపరమైన వ్యాధుల కోసం చేపట్టే సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అత్యాధునిక చికిత్సల అభివృద్ధికి ఇది ఒక టెస్ట్ బెడ్ గా పనిచేయనుంది.

అంతర్జాతీయ ప్రమాణాలు

ఈ సంస్థ కేవలం పేరు మార్చుకోవడమే కాకుండా.. ఓఈసీడీ-జీఎల్పీ (గుడ్ ల్యాబరేటరీ ప్రాక్టీస్) ప్రమాణాలను అనుసరిస్తుంది. అంటే హైదరాబాద్‌లోని ఈ ల్యాబ్‌లో జరిగిన పరిశోధన ఫలితాలను అమెరికాలోని ఎఫ్డీఏ లేదా ఐరోపాలోని ఈఎంఏ వంటి అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు నేరుగా ఆమోదిస్తాయి. దీనివల్ల మన దేశీ కంపెనీలు విదేశాల్లో మందులను విడుదల చేయడం చాలా సులభతరం అవుతుంది. గతంలో క్లిష్టమైన టాక్సికాలజీ (విష ప్రభావ పరీక్షలు) కోసం మనం చైనా లేదా యూరప్ దేశాల వైపు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా మన శాస్త్రవేత్తలే ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం వైద్య రంగం మాత్రమే కాదు, దేశ రక్షణకు (బయో డిఫెన్స్) సంబంధించిన టీకాల అభివృద్ధిలోనూ అత్యంత కీలకం కానుంది. జంతువులపై హింసను తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న 3ఆర్ఎస్ (రీప్లేస్ మెంట్, రిడక్షన్, రిఫైన్ మెంట్) సూత్రాన్ని ఈ సంస్థ పక్కాగా అమలు చేయబోతోంది. జంతువులకు బదులుగా ఆర్గన్-ఆన్-ఏ-చిప్ వంటి సాంకేతికతను వాడటం, తక్కువ జంతువులతో ఎక్కువ ఫలితాలు సాధించడం, ప్రయోగాల సమయంలో జంతువులకు నొప్పి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడమే 3ఆర్ఎస్ ఉద్దేశం.

హైదరాబాద్‌ హబ్

హైదరాబాద్ ఇప్పటికే వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఐసీఎంఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో నగరం గ్లోబల్ రీసెర్చ్ హబ్ గా మరో మెట్టు ఎక్కింది. కేంద్ర ఆరోగ్య పరిశోధన విభాగం (డీహెచ్ఆర్) పర్యవేక్షణలో పనిచేసే ఎన్ఐపీసీఆర్, ఇకపై అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలకు సైతం గమ్యస్థానంగా మారే అవకాశం ఉంది. ఇది తెలంగాణకు భారీగా విదేశీ పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్ రూపాంతరం కేవలం పేరు మార్పు మాత్రమే కాదు.. ఇది భారత ఆత్మనిర్భరతకు, ప్రపంచ ఆరోగ్య భద్రతకు వేసిన బలమైన పునాదిగా చెప్పొచ్చు.

Next Story