Damodar Rajanarsimha: నకిలీ మందులపై ఉక్కుపాదం మోపుతాం

by Gantepaka Srikanth |

ఔషధ తయారీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

Damodar Rajanarsimha: నకిలీ మందులపై ఉక్కుపాదం మోపుతాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఔషధ తయారీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియా ఫార్మా ఎక్స్‌పో-2026లో పాల్గొన్న ఆయన, తెలంగాణ ఔషధ రంగానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లు, మందులు సరఫరా చేసి మన సామర్థ్యాన్ని నిరూపించుకున్నామని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1500కు పైగా ఏపీఐ, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, మెడికల్ డివైసెస్ తయారీ యూనిట్లు ఉన్నాయని, ఇది మన పారిశ్రామిక శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే 80కు పైగా టెస్టింగ్ సెంటర్లు, 50 వేలకు పైగా మెడికల్ షాపులతో బలమైన వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. ఔషధ రంగంలో చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా అది అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠపై ప్రభావం చూపుతుందని మంత్రి హెచ్చరించారు. "నాణ్యత, భద్రత, పారదర్శకత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారే నకిలీ, నాసిరకం మందుల తయారీదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతోంది" అని స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా ఉన్న ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, వైద్యులు, పారిశ్రామికవేత్తలే మన విజయానికి మూలస్తంభాలని మంత్రి అన్నారు.

ఫార్మా ఎక్స్‌పో వంటి వేదికలు కేవలం ప్రదర్శనలకు మాత్రమే పరిమితం కాకుండా.. కొత్త ఆలోచనలు, పరిశోధనలు, ప్రభుత్వం-పరిశ్రమల మధ్య సహకారానికి వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఫార్మా రంగాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎక్స్‌పో‌లో ఏర్పాటు చేసిన ఫార్మా, అనుబంధ కంపెనీల స్టాళ్లను మంత్రి సందర్శించారు. వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన సంస్థలకు మంత్రి అవార్డులు అందజేశారు.

Next Story