- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్య రంగానికి హబ్‌గా హైదరాబాద్.. ఏఎన్బీఏఐ ప్రెసిడెంట్ డాక్టర్ చాబ్రా కీలక వ్యాఖ్యలు
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలు అద్భుతంగా ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డు అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ (ఏఎన్బీఏఐ) ప్రెసిడెంట్ డాక్టర్ చాబ్రా పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ వైద్యరంగానికి హబ్‌గా మారిందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలు అద్భుతంగా ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డు అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ (ఏఎన్బీఏఐ) ప్రెసిడెంట్ డాక్టర్ చాబ్రా పేర్కొన్నారు. వైద్య విద్య బోధనలో విలువలను పెంపొందించాలని, పరిశోధనల సంఖ్యను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో వైద్య విద్య కోర్సుల నిర్వహణ చేపట్టే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) నేతృత్వంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రైవేటు హాస్పిటల్స్ లో వైద్య విద్య అందిస్తున్న వైద్య ఉపాధ్యాయులకు శనివారం హైదరాబాద్ లో 75 మందికి ఉత్తమ బోధకుల పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమానికి చాబ్రా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో ఎన్బీఈఎంఎస్ అనుమతితో వైద్య విద్య అందిస్తున్న హాస్పిటల్స్ లో దాదాపు 10000 పైగా పీజీ సీట్లు, 3500 వరకు డిప్లొమా, ఎంబీబీఎస్ సీట్లు పెంచే విధంగా కృషి చేశామని తెలిపారు. నాణ్యమైన విద్య కోసం ఎన్నో సెమినార్లు, బోధనా కార్యక్రమాలను అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్ హాస్పిటల్స్ సంఖ్య ఇప్పటికే రెట్టింపు అయిందని, ప్రజలకు ఆరోగ్య సేవలు సులభంగా అందించడానికి ప్రభుత్వ సహకారంతో తమ అసోసియేషన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎపిడమిక్ సమయాల్లో వైద్యుల కొరత లేకుండా చూడాలన్నదే తమ సంకల్పమన్నారు.
వైద్యుల అంతరాన్ని తగ్గించాలి...
ప్రతి వెయ్యి మంది రోగులకు ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెప్తున్నదని.. మన దేశంలో మాత్రం వెయ్యి మంది రోగులకు 1.456 నిష్పత్తిలో వైద్యులు ఉన్నారని ఏఎన్బీఏఐ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ లింగయ్య తెలిపారు. వైద్యుల అంతరాన్ని తగ్గించేందుకు దేశంలోని ప్రతి జిల్లా కేంద్రానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విలువలతో విద్యాబోధనను అందించే వారికి తమ అసోసియేషన్ పూర్తి మద్దతుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం డీ.ఎన్.బీ కోర్సు చదువుతున్న విద్యార్థులకు గోల్డ్ మెడల్ సంఖ్యను పెంచాలని పిలుపునిచ్చారు. 100 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ డీఎన్బీ కోర్సును మొదలు పెట్టవచ్చని అందుకు తమ అసోసియేషన్ పూర్తి మద్దతు అందిస్తుందని ఏఎన్బీఏఐ అసోసియేషన్ జాతీయ సెక్రటరీ డాక్టర్ రాహుల్ తెలిపారు. ఇంతకుముందే ఈ కోర్సులు నిర్వహిస్తున్న యాజమాన్యాలు తమ అసోసియేషన్ లో చేరాలని పిలుపునిచ్చారు.
వైద్య విద్య పూర్తిచేసిన విద్యార్థులు తమ అసోసియేషన్ మద్దతు తీసుకుని ఉద్యోగాన్ని సులభంగా పొందవచ్చని నేషనల్ అలుమ్ని కోఆర్డినేటర్ డాక్టర్ బాలరాజు తెలిపారు. పైచదువుల కోసం అవసరమైన డేటా తమ అసోసియేషన్ అందిస్తుందని తెలిపారు. గత పదేళ్లుగా తమ అసోసియేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక మంది వైద్య ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించామని ఏఎన్బీఏఐ రెండు రాష్టాల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తిరుమల ప్రసాద్ తెలిపారు. అనేక సెమినార్స్, పరిశోధన తరగతులను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ ఖుబ్ చంద్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ వీర ప్రకాష్, డాక్టర్ మణిమాల రావు, డాక్టర్ కల్పన, బాలశ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 300 మంది వైద్యులు పాల్గొన్నారు.






