గ్లోబల్‌ వ్యాక్సిన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా హైదరాబాద్‌: రేవంత్‌ రెడ్డి

by Prasad Jukanti |

హైదరాబాద్‌ను గ్లోబల్ వ్యాక్సిన్ హబ్‌గా అభివృద్ధి చేస్తూ, లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు సీఎం పిలుపునిచ్చారు.

గ్లోబల్‌ వ్యాక్సిన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా హైదరాబాద్‌: రేవంత్‌ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. 23 సంవత్సరాల క్రితం బయో ఏషియా (BioAsia 2026) ప్రారంభమైనప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ ,సాఫ్ట్‌వేర్ నగరం అన్న గుర్తింపు ఉండేదని కానీ ఇప్పుడు గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‍గా మారిందన్నారు. ఇవాళ హైదరాబాద్ హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న బయో ఆసియా సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఈ బలాల ఆధారంగా హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్‌లో విశిష్టతకు ప్రపంచ కేంద్రంగా ఎదిగిందన్నారు. . గత రెండు సంవత్సరాల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు.

మా సక్సెస్ కు నిదర్శనం ఇదే:

కొద్ది వారాల క్రితం దావోస్‌లో మా కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని సీఎం చెప్పారు. జీనోమ్ వ్యాలీని విస్తరించాం. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు “వన్-బయో”ను ప్రారంభించామన్నారు. గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేశామని, అనేక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఆహ్వానించామన్నారు. ఇది సాధారణ అభివృద్ధి కాదని ఇది దృఢమైన విజన్ ఫలితమేనన్నారు. మా సక్సెస్‍కు బయోఏషియా-2026 ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. బయోఏషియా తన పేరును దాటి బయో-వరల్డ్‌గా మారుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు ఇక్కడ హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారు. సైన్స్, AI, బయోటెక్ వంటి రంగాల్లో ప్రముఖులను కలిసినప్పుడు అసాధారణమైన ఫలితాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఏషియా సదస్సు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఇటీవల “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌ను ప్రకటించామని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడం మా లక్ష్యం అని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి:

ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు , ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం అన్నారు. మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారని ఈ సౌకర్యాలు తెలంగాణ అందిస్తోందని చెప్పారు. బల్క్ డ్రగ్స్ నుండి బయాలజిక్స్ వరకు, తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందని చెప్పారు. మేము కేవలం భారతదేశంలోనే పోటీ పడటం లేదు, ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నామన్నారు. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందని ఇప్పుడు మనం కలిసి దీన్ని సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదామన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని మీ జీసీసీలను స్థాపించి, ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించాలని సీఎం పిలుపునిచ్చారు. మాలిక్యూల్స్, ఔషధాలను డిజైన్ చేయాలని, క్లినికల్ అనలిటిక్స్‌ను నడపాలన్నారు. ఏఐ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేసి, డిజిటల్ తయారీని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మా ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు, నైపుణ్యంతో కూడిన యువత మీ విజయానికి భాగస్వాములుగా ఉంటారని సీఎం చెప్పారు. మనమంతా కలిసి పనిచేస్తే హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుండి ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదిగేలా చేద్దామన్నారు. ప్రపంచ అవసరాలకు తెలంగాణ సిద్ధంగా ఉందని, తెలంగాణ అంటే బిజినెస్ అని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Next Story