నాగోల్‌లో దారుణం.. పెళ్లైన ఏడాదికే భార్య గొంతుకోసిన సైకో భర్త

by Naga Rani Yarlagadda |

పెళ్లైన ఏడాదికే ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో భార్య గొంతు కోశాడు. హైదరాబాద్ సిటీలోని నాగోల్ లోని ఈ దారుణ ఘటన జరిగింది.

నాగోల్‌లో దారుణం.. పెళ్లైన ఏడాదికే భార్య గొంతుకోసిన సైకో భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి సమయంలో ఎన్ని లక్షల కట్నమిచ్చినా.. కొందరు భర్తలకు వరకట్న దాహం తీరడం లేదు. కోట్లు కుమ్మరించినా ఇంకా కావాలంటూ వేధింపులకు గురిచేస్తూ.. చిత్రహింసలు పెడుతున్నారు. పెళ్లి చేసుకున్న వేళ కట్నంగా రూ.20 లక్షలిచ్చినా అదనపు కట్నం కావాలని భార్యను వేధించాడో సైకో భర్త. పెళ్లైన ఏడాదికే ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో భార్య గొంతు కోశాడు. హైదరాబాద్ సిటీలోని నాగోల్ లోని ఈ దారుణ ఘటన జరిగింది. బాధితురాలికి తీవ్రగాయాలు కాగా.. నాగోల్ లోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతేడాది మహాలక్ష్మి (20), వేణుగోపాల్ కు పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లైన నెలరోజుల నుంచే అదనపు కట్నంకోసం వేణుగోపాల్ మహాలక్ష్మిని వేధించాడు. చితకబాదుతూ కట్నం కోసం చిత్రహింసలు పెట్టడంతో భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అతని వ్యవహారం గురించి పెద్దలకు చెప్పగా వారంతా పంచాయతీ చేసి సర్దిచెప్పారు. కొద్దిరోజులు సజావుగానే ఉన్నా.. మళ్లీ అదనపుకట్నం కోసం వేధించసాగాడు. చివరికి కట్నంకోసం గొడవ పెరిగి పెద్దది కావడంతో ఆమె గొంతుకోశాడు.

మహాలక్ష్మి అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి, బాధితురాలిని సుప్రజ ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు రావడం ఆలస్యం కావడంతో ముందుగా ఎలాంటి ఫీజు లేకుండానే వైద్యులు ట్రీట్మెంట్ చేసి, సర్జరీ కూడా చేశారు.

Next Story