- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేపాలీ గ్యాంగ్ కోసం కొనసాగుతున్న వేట.. విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. డబ్బు, నగల కోసమే ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పనిమనిషి పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య, దోపిడీ వ్యవహారం పోలీసులకు తెలిసేలోపే నిందితులు రాష్ట్రం దాటేయడంతో, వారిని పట్టుకునేందుకు పదికి పైగా ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో పారిపోయినట్లు పోలీసుల సమాచారం. ముంబై, లక్నో, ఢిల్లీలో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారని తెలిసింది.
నోట్లో గుడ్డలు కుక్కి.. ఊపిరాడకుండా చేసి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ (55) నిన్న తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పనిమనిషి ‘కల్పన’.. మరో ఇద్దరు అనుచరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. నిద్రిస్తున్న తనూజ నోట్లో గుడ్డలు కుక్కి, ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చారు. అనంతరం ఇంట్లోని బంగారం, నగదు దోచుకుని ముగ్గురు నిందితులు పరారయ్యారు.
రంగంలోకి 10 ప్రత్యేక బృందాలు..
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రధాన నిందితురాలు కల్పనకు సంబంధించిన పూర్తి వ్యక్తిగత వివరాలను సేకరించారు. నిందితులు రాష్ట్రం నుంచి ఎలా పారిపోయారు? ఏ వాహనంలో వెళ్లారు? అన్నదానిపై ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత వారం రోజులుగా జూబ్లీహిల్స్ బస్తీలో కొత్తవారి కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో, బస్తీ వాసులను పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేపాలీ గ్యాంగ్ కోసం జల్లెడ పడుతున్నారు.






