ఖానాపూర్ మున్సిపాలిటీలో ‘హంగ్’ ఉత్కంఠ.. కోరం లేక చైర్మన్ ఎన్నిక వాయిదా?

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-16 03:22:02  IST  )

నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య బలాబలాలు సమానంగా ఉండటం, మ్యాజిక్ ఫిగర్ 7ను ఎవరూ అందుకోకపోవడంతో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది.

ఖానాపూర్ మున్సిపాలిటీలో ‘హంగ్’ ఉత్కంఠ..  కోరం లేక చైర్మన్ ఎన్నిక వాయిదా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ (Khanapur) చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, ప్రధాన పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (Magic Figure) 7 కాగా.. ప్రస్తుత ఫలితాలు ఏ పార్టీకి ఆశాజనకంగా రాలేదు. బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఓటుతో ఆ పార్టీ బలం 5కి చేరింది. చైర్మన్ పీఠం దక్కాలంటే కాంగ్రెస్‌కు ఇంకా ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం కాగా, బీజేపీ లేదా బీఆర్ఎస్‌లు పీఠం దక్కించుకోవాలంటే పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది.

కుదరని సయోధ్య..

కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేసే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య మంతనాలు జరిగినట్లు ప్రచారం సాగింది. అయితే, చైర్మన్ పదవి ఎవరికి దక్కాలనే విషయంలో ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు పార్టీలూ సమానంగా నాలుగు స్థానాల చొప్పున గెలుచుకోవడంతో ఎవరూ తగ్గడం లేదు. ఫలితంగా కోరం లభించే పరిస్థితి లేకపోవడంతో ఎన్నిక ప్రక్రియను అధికారులు వాయిదా వేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story