మానవ మృగాలు ఫామ్‌హౌస్‌లో ఉన్నాయి.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-25 07:52:03  IST  )

తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీలు అవిభక్త కవలలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

మానవ మృగాలు ఫామ్‌హౌస్‌లో ఉన్నాయి.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీలు అవిభక్త కవలలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) క్యాంపస్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. రూ.90 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం డిజిటల్ లైబ్రరీతో పాటు రీడింగ్ రూమ్‌ను ఓపెన్ చేశారు. అదేవిధంగా దుందుభి, బీమా వసతి భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఓయూ వైస్ ఛాన్స్‌లర్ వీసీ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా వర్సిటీలో పర్యటించాలంటూ వీసీ ఆహ్వానించారని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారని తెలిపారు. ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని అన్నారు. నిజాం నవాబును పొగుడుతూ పాడటం కాదు.. దేశ స్వాతంత్య్రం కోసం ఓయూ గడ్డపై నిలబడి వందేమాతరం పాడిన పీవీ నరసింహా రావు (PV Narasimha Rao) నేడు తనకు గుర్తొస్తున్నారని తెలిపారు. సాయుధ పోరాటంలో భాగంగా మారుమూల పల్లెల్లో ఎర్రజెండా పట్టుకుని పోరాటం చేసిన ఎందరో మహాభావులు ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడిందని అన్నారు. జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్‌ పాటిల్‌ (Shivaraj Patil)తో మొదలు పెడితే.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన పీవీ నరసింహా రావు లాంటి మహనీయులు చదివిన వర్సిటీ.. ఉస్మానియా వర్సిటీ అని కొనియాడారు.

ఉస్మానియాను కాలగర్భంలో కలపాలని చూశారు..

తెలంగాణ తొలితరం మర్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy), మల్లికార్జున్ గౌడ్, మదన్మోహన్ లాంటి వాళ్లు కూడా ఓయూ విద్యార్థులేనని అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఘనత సాధించిన మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి (Jaipal Reddy) కూడా ఓయూ బిడ్డేనని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చరిత్ర మరువదని అన్నారు. నేటికీ తెలంగాణలో ఏ సమస్య వచ్చినా.. ఉద్యమానికి పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీయేనని పేర్కొన్నారు. చదువుతో పాటు పోరాటాన్ని నేర్పింది వర్సిటీయేనని.. తెలంగాణ సాధన యాదయ్య, శ్రీకాంతా చారి, వేణుగోపాల్ రెడ్డి కోసం అమరుడయ్యాడని గుర్తు చేశారు. అలాంటి చైతన్యాన్ని రగిల్చిన ఉస్మానియాను కొందరు కాలగర్భంలో కలిపాలని చూశారని ఆరోపించారు. 108 ఏళ్ల యూనివర్సిటీకి ఓ దళితుడిని వీసీగా చేసి చూపించామని అన్నారు. ఇక్కడే చదువుకున్న వారికి విద్యారంగంలో కీలక పదవులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

డ్రగ్స్, గంజాయి కల్చర్ వేగంగా విస్తరిస్తోంది..

నేడు దేశానికి యువ నాయకత్వం అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యల చర్చే కాదు.. సైద్ధాంతిక అంశాలకు కూడా వేదిక కావాలన్నారు. సామాజిక, సాంకేతిక అంశాలపై డిస్కషన్ జరగాలని అన్నారు. మనలో అసహనం పెరిగిందని, అశాంతి ఎక్కువైందని కామెంట్ చేశారు. చర్చించే వారిపై అణిచివేత ఎక్కవ కాలం నిలబడదని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పరిణామాలు మానసిక వేదనకు గురిచేస్తున్నాయని తెలిపారు. కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్నారని అన్నారు. డ్రగ్స్, గంజాయి కల్చర్ వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో చైతన్యవంతమైన చర్యలు లేకపోవడం వల్లే అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. పేదలకు పంచేందుకు భూములు లేవని.. పేదల తలరాతలను మార్చేందుకు ప్రభుత్వం ఇవ్వగలిగింది నాణ్యమైన విద్య అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఓయూ‌కు మళ్లీ వస్తా.. ఈసారి ఒక్క పోలీస్ ఉండొద్దు

తాను కూడా పేదరికం నుంచి ఈ స్థాయికి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు వారిని నష్టం చేసిన వాళ్లను నిర్ధ్వందంగా వ్యతిరేకించాలని పిలపునిచ్చారు. మన బడ్జెట్ రూ.లక్ష కోట్లు కాళేశ్వరం రూపంలో గంగలో కలిశాయని అన్నారు. కానీ, తమ ప్రభుత్వం రూ.25 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా స్కూళ్లను నిర్మిస్తోందని తెలిపారు. తాను మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీ తప్పకుండా వస్తానని.. డిసెంబర్‌లో ఆర్డ్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతానని అన్నారు. క్యాంపస్ పరిధిలో ఒక్క పోలీస్ కూడా ఉండొద్దని.. ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చని అన్నారు. అప్పుడు విద్యార్థులు నినసన తెలిపినా తాను ఏమీ అనబోనని తెలిపారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలపై అదేరోజు అక్కడికక్కడే ఓయూ అభివృద్ధి పనులకు జీవోలు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

మరో 15 రోజుల్లో ఎమ్మెల్సీగా కోదండరాంను పంపుతాం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ఏనుగులు సింహాలు ఉన్నాయంటూ ఏఐ టెక్నాలజీతో వీడియో క్రియేట్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ ఏనుగులు, మానవ మృగాలు ఫామ్‌హౌస్‌లో ఉన్నాయని.. ముందు వాటిని బంధించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై ఢిల్లీ వరకు వెళ్లి కుట్రలు చేశారని.. మరో 15 రోజుల్లోగా ఎమ్మెల్సీగా కోదండరామ్‌ను పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓయూకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తానని.. ఇంజినీర్స్ కమిటీ వేయాలంటూ యోగితారాణాను సీఎం ఆదేశించారు.

Next Story