- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిటైర్మెంట్ ఇయర్ 2026.. ఇరిగేషన్ శాఖలో భారీగా రిటైర్‌మెంట్‌లు
రాష్ట్ర నీటిపారుదల శాఖలో 2026లో పెద్దఎత్తున అధికారులు ఉద్యోగ విరమణ చేయనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర నీటిపారుదల శాఖలో 2026లో పెద్దఎత్తున అధికారులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. జనవరి నుంచి డిసెంబర్ 2026 మధ్య ఇంజినీర్-ఇన్-చీఫ్, చీఫ్ ఇంజినీర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి ల్లో మొత్తం 60 మందికి పైగా అధికారులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓఆర్ టీ 360 జారీ చేసింది. ఉత్తర్వులో పేర్కొన్న ప్రకారం, 61 ఏళ్ల వయస్సు పూర్తిచేసే తేదీలకు అనుగుణంగా రిటైర్‌మెంట్‌లు అమలు కానున్నాయి. కొంతమంది అధికారులపై ఉన్న క్రమశిక్షణా చర్యలు తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్, 1980 ప్రకారం రిటైర్‌మెంట్ తర్వాత కూడా కొనసాగించవచ్చునంటూ ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
పదోన్నతులకు పెద్ద అవకాశం..
ఇరిగేషన్ శాఖలో పదోన్నతుల కోసం చాలా మంది ఇంజినీర్లు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో చాలా మంది ఉన్నతాధికారులు ఉద్యోగ విరమణ చేయగానే వారికి ఎక్స్‌టెన్షన్లు ఇచ్చి ఏళ్లకు ఏళ్లు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌రావు అలాగే కీలక బాధ్యతల్లో కొనసాగారు. దీంతో ఆయన తర్వాత పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారు అవకాశం దక్కక ఆవేదనకు గురయ్యారు. రేవంత్ సర్కారు సైతం ఇదే ఒరవడి కొనసాగించింది. అయితే తాజాగా భారీగా ఉద్యోగ విరమణలు తమకు అందివచ్చిన అవకాశంగా చాలా మంది ఇంజినీర్లు భావిస్తున్నారు. ఈ భారీ రిటైర్‌మెంట్ వేవ్ కారణంగా శాఖలో ప్రమోషన్‌లకు విస్తృత అవకాశాలు తెరుచుకాబోతున్నాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఈ పోస్టులు ఖాళీ అవ్వడంతో ఎస్ఈలు ప్రమోషన్ జోన్‌లోకి వస్తారు. ఎస్ఈ స్థాయిలో ఖాళీలతో ఈఈలకు అవకాశాలు పెరుగుతాయి. 40కి పైగా ఈఈ, డీఈఈ పోస్టులు ఖాళీ అవ్వడం వల్ల మధ్యస్థాయి అధికారుల పదోన్నతులు వేగవంతం కావచ్చు. ప్రభుత్వం త్వరలో డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశాలను నిర్వహిస్తే, 2026 మధ్య నాటికి ఖాళీలన్నీ భర్తీ అయ్యే అవకాశముందని ఇంజనీర్లు ఆశిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం తరహాలో ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసే వారికి ఎక్స్‌టెన్షన్లు ఇవ్వకూడదని అనేక మంది ఇంజినీర్లు కోరుతున్నారు. ఈ అంశంపై గతంలో ప్రభుత్వానికి ఇంజనీర్లు నేరుగా విజ్ఞప్తులు కూడా చేశారు.
రిటైరవుతున్నది వీరే..
ఇంజనీర్-ఇన్-చీఫ్: మొహమ్మద్ అమ్‌జాద్ హుస్సేన్ (31.01.2026)
చీఫ్ ఇంజినీర్‌లు: (11 మంది) జనవరి నుంచి జూలై 2026లో రిటైర్‌మెంట్
సూపరింటెండింగ్ ఇంజనీర్‌లు: (9 మంది) మార్చి నుంచి ఆగస్టు 2026
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌లు: (30 మందికి పైగా) ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2026
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌లు: (17 మంది) మే నుంచి అక్టోబర్ 2026






