TG: మీ సేవా వాట్సాప్స్‌కు భారీ స్పందన

by Gantepaka Srikanth |

TG: మీ సేవా వాట్సాప్స్‌కు భారీ స్పందన

TG: మీ సేవా వాట్సాప్స్‌కు భారీ స్పందన
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మీసేవా వాట్సాప్‌కు భారీ స్పందన లభిస్తున్నది. వినియోగదారుల నుంచి ఊహించిన దానికి మించి స్పందన లభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ డిజిటల్‌ సేవల వేదిక మీ సేవా కింద ప్రారంభించిన వాట్సాప్‌/చాట్‌బాట్‌ సేవను ప్రారంభించింది. ప్రజలు కేవలం 22 రోజుల్లోనే 2.7 లక్షల సార్లు ఉపయోగించారని మంత్రి తెలిపారు.

నవంబర్ 18న ప్రారంభం..

గత నెల 18న మీ సేవా కింద అదనపు డిజిటల్‌ చానల్‌గా ఈ సేవను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ప్రజలు ఇకపై మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండానే ప్రభుత్వ సేవలు పొందగలుగుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం ఇందులో దరఖాస్తు చేయవచ్చు. బిల్లుల వివరాలూ తెలుసుకోవచ్చు. దరఖాస్తుల స్థితిని పరిశీలించవచ్చు. ఫిర్యాదులు కూడా నమోదు చేయవచ్చు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ సేవను ప్రజలు సైతం అదే స్థాయిలో వినియోగించుకుంటున్నారు. ప్రజల కేంద్రిత డిజిటల్‌ పరిపాలనను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను ప్రారంభించారు.

75,655 దరఖాస్తులు..

ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ విభాగం వెల్లడించిన గణాంకాల ప్రకారం, నవంబర్‌ 18 నుంచి డిసెంబర్‌ 9 వరకు మీ సేవా వాట్సాప్‌ సేవను ప్రజలు మొత్తం 2,78,267 సార్లు వినియోగించారు. ఈ కాలంలో 2,09,084 వేర్వేరు మొబైల్‌ నంబర్ల నుంచి ప్రజలు ఈ సేవను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో 75,655 దరఖాస్తు ఫారాలు సమర్పించారు. వీటిలో 1,403 మాత్రమే నిజమైన దరఖాస్తులు కాగా, మిగిలినవి సేవల గురించి తెలుసుకునేందుకు లేదా విధానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అలాగే 45,829 సార్లు దరఖాస్తుల స్థితిని తెలుసుకున్నారు. మొత్తంగా 81.3 శాతం సక్సెస్ రేట్‌గా నమోదైంది. అయితే.. ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న సేవల్లో జనన, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పోలీస్‌ చలాన్లు, విద్యుత్‌ బిల్లుల సేవలు నమోదయ్యాయి. భవిష్యత్తులోనూ మీ సేవా ద్వారా మరిన్ని డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు. వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని, ప్రజలకు సులభంగా, నిరంతరాయంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Next Story