- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నర్సింగ్ విద్యార్థులకు భారీ ఊరట.. రిజిస్ట్రేషన్‌కు ఐఎన్‌సీ సర్టిఫికెట్ అక్కర్లేదు : హై కోర్టు
రిజిస్ట్రేషన్ పొందడానికి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) సూటబిలిటీ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధనను కేరళ హైకోర్టు కొట్టివేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటకలో నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు కేరళలో ఊరట లభించింది. కేరళలో రిజిస్ట్రేషన్ పొందడానికి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) సూటబిలిటీ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధనను కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీనివల్ల కర్ణాటకలోని గుర్తింపు పొందిన కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులకు కేరళలో నర్సులుగా సేవలందించేందుకు మార్గం సుగమమైంది. కర్ణాటక నర్సింగ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. కర్ణాటక నర్సింగ్ కౌన్సిల్ గుర్తించిన కళాశాలల్లో చదివిన విద్యార్థులకు, ఐఎన్‌సీ గుర్తింపు లేదనే సాకుతో రిజిస్ట్రేషన్ నిరాకరించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. నర్సింగ్ విద్యా ప్రమాణాల నిర్ణయం, తనిఖీలకు మాత్రమే ఐఎన్‌సీ పరిమితమని, కాలేజీలకు అసలు గుర్తింపునిచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిళ్లకే ఉంటుందని కోర్టు పేర్కొంది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కర్ణాటక) అందించే బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ, కేంద్ర చట్టమైన ఐఎన్‌సీ యాక్ట్-1947 పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ డిగ్రీ పొందిన వారు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రిజిస్ట్రేషన్ పొందే అర్హత కలిగి ఉంటారని తెలిపింది. కేరళ నర్సులు-మిడ్‌వైవ్స్ చట్టం-1953 ప్రకారం ఐఎన్‌సీ సర్టిఫికెట్ తప్పనిసరి అనే నిబంధన ఎక్కడా లేదని, కేరళ నర్సింగ్ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం అహేతుకమైనదని కోర్టు అభిప్రాయపడింది.
ఉద్యోగాలకు లైన్ క్లియర్..
కేంద్ర చట్టంలోని షెడ్యూల్‌కు అనుగుణమైన విద్యార్హతలు కలిగి ఉండి, కర్ణాటకలో గుర్తింపు పొందిన సంస్థల్లో చదివిన విద్యార్థులందరినీ కేరళలో నర్సులుగా రిజిస్టర్ చేయాలని కేరళ నర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు లబ్ధి చేకూరనుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిబంధనలపై ఇప్పుడు చర్చ మొదలయ్యే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు భావిస్తున్నారు.






