Sarpanch Elections: ఫస్ట్ ఫేజ్‍లో భారీగా నామినేషన్లు.... అత్యధికంగా ఆ జిల్లాలోనే పోటీ

by Prasad Jukanti |   (  Updated:2025-11-30 07:20:02  IST  )

ఫస్ట్ ఫేజ్ లో భారీగా నామినేషన్లు.... అత్యధికంగా ఆ జిల్లాలోనే

Sarpanch Elections: ఫస్ట్ ఫేజ్‍లో భారీగా నామినేషన్లు.... అత్యధికంగా ఆ జిల్లాలోనే పోటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం నిన్న రాత్రి వరకు కొనసాగింది. చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. రాష్ట్రంలో 189 మండలాల్లోని 4236 పంచాయతీలు, 37440 వార్డులకు తొలిదశలో నిర్వహిచే ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు తాజాగా వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ లో సర్పంచ్ పదవి కోసం 25,654 నామినేషన్లు, వార్డు స్థానాలకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవికి అత్యధికంగా సూర్యాపేట జిల్లాల్లో 1387 నామినేషన్లు దాఖలు అయ్యారు. ఈ జిల్లాల్లో తొలి దశలో మొత్తం 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబోతుండగా చివరి రోజున (శనివారం) 1021 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అత్యధిక నామినేషన్లు దాఖలైన రెండో జిల్లాగా వికారాబాద్ నిలిచింది. ఈ జిల్లాల్లో 262 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించబోతుండగా 1383 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత మహబూబాబాద్‍లో 155 జీపీలకు గాను 1239, ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో 167 జీపీలకు గాను 1224 నామినేషన్లు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 174 జీపీలకు గాను 1169 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అత్యల్పంగా ముగులు జిల్లాలో 48 జీపీలకు గాను 220 నామినేషన్లు దాఖలయ్యాయి.

వార్డుల నామినేషన్లు:

తొలిదశలో మొత్తం 37440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందుకు గాను అత్యధిక నామినేషన్లు రంగారెడ్డి జిల్లాలో దాఖలయ్యాయి. ఈ జిల్లాలో 1530 వార్డులకు గాను 4540 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్‍లో 2198 వార్డులకు గాను 4379, ఖమ్మంలో1740 వార్డులకు గాను 4041, కామారెడ్డిలో 152 వార్డులకు గాను 3832, సూర్యాపేటలో 1442 వార్డులకు గాను 3791 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అత్యల్పంగా ములుగులో 420 వార్డు స్థానాలకు గాను 967 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజైన శనివారం నాడు సర్పంచ్ స్థానాలకు రాష్ట్రవ్యాప్తంగా 17,940 నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 70596 నామినేషన్లు దాఖలయ్యాయి.

తప్పుకునేదెవరు? నిలిచేదెవరు?

ఈ నామినేషన్లను అధికారులు ఇవాళ పరిశీలించనున్నారు. పరిశీలించి చెల్లుబాటు అయ్యే నామినేషన్ల వివరాలు ఇవాళే ప్రకటించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల 3వ తేదీ వరకు తుది గడువు ఉంది. తొలి దశ పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించి అదే రోజును ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అయితే భారీ సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు ధాఖలు చేయడంతో చివరి వరకు ఎంత మంది బరిలో ఉంటారు ఎంత మంది విత్ డ్రా చేసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

Next Story