KTR: మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు

by Gantepaka Srikanth |

సూర్యాపేట జిల్లాలోని మైనింగ్ బ్లాక్‌ల ఈ-వేలం ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

KTR: మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సూర్యాపేట జిల్లాలోని మైనింగ్ బ్లాక్‌ల ఈ-వేలం ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపి, వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. గనుల శాఖ చేపట్టిన ఈ వేలం ప్రక్రియ పారదర్శకతకు విరుద్ధంగా సాగిందని ఆరోపించారు. పసుపులబోడు, సైదుల్నామా, సుల్తాన్‌పూర్ మైనింగ్ బ్లాక్‌లలో సుమారు 1,100 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమి ఉన్నప్పటికీ.. టెండర్ పత్రాల్లో చట్టబద్ధంగా అవసరమైన వివరాలు పొందుపరచలేదని ఆరోపించారు. ముఖ్యంగా మినరల్ బ్లాక్‌ల ఖచ్చితమైన అక్షాంశ-రేఖాంశ కో ఆర్డినేట్లు, అటవీ కంపార్ట్‌మెంట్ వివరాలు, డీజీపీఎస్ సర్వే ధ్రువీకరణ, వివరణాత్మక సర్వే మ్యాపులు, యూటీఎం జియో కో ఆర్డినేట్లు, అలాగే మినరల్ ఆక్షన్ రూల్స్, 2015, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్, 1957 ప్రకారం అవసరమైన సమగ్ర జియోలాజికల్ నివేదికలు వెల్లడించలేదని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి లోపాలు వేలం ప్రక్రియ చట్టబద్ధతను, పారదర్శకతను తీవ్రంగా దెబ్బతీస్తాయని తెలిపారు.

అనుమానాలకు తావిస్తున్నాయి..

టెండర్ నోటీసు జారీకి ముందే మినరల్ బ్లాక్‌లను ఖచ్చితంగా గుర్తించి పూర్తి వివరాలు వెల్లడించడం తప్పనిసరి అయినప్పటికీ, ఈ నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడం, చట్టపరమైన, పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ప్రకటించడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. సైదుల్నామా బ్లాక్‌కు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, సుల్తాన్‌పూర్ బ్లాక్‌కు ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలను ప్రిఫర్డ్ బిడ్డర్లుగా ప్రకటించారని.. ఈ సంస్థలు రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అలాగే.. మైన్స్ అండ్ జియోలజీ శాఖ లీగల్ ఆఫీసర్ ఈ బ్లాక్‌ల సమాచారాన్ని గోప్యంగా పేర్కొంటూ ఫిర్యాదుదారునికి ఇవ్వడానికి నిరాకరించడం పారదర్శకతపై అనుమానాలు పెంచుతున్నదని పేర్కొన్నారు. అటవీ శాఖ నుండి ఎన్‌వోసీ లేకుండానే వేలం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అటవీ అనుమతులు పొందిన తర్వాతే చట్టబద్ధంగా కొత్త టెండర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

Next Story