తెలంగాణలో భారీ పెట్టుబడుల వేట.. అధికారులకు సీఎస్ రామకృష్ణారావు దిశానిర్దేశం

by Ramesh Naini |

తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సూచించారు.

తెలంగాణలో భారీ పెట్టుబడుల వేట.. అధికారులకు సీఎస్ రామకృష్ణారావు దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పరిశ్రమలశాఖ అధికారులతో, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లతో సోమవారం సెక్రెటేరియట్‌లో పరిశ్రమల శాఖపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి వివిధ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు ఆస్తకి చూపుతున్నారని.. ఆ దిశలో పరిశ్రమల శాఖ అధికార యంత్రాంగం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. తగు ప్రణాళికను సిద్ధం చేసుకొని పారిశ్రామికవేత్తలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎంవోయూలతోపాటు పెట్టుబడిదారులకు అవసరమైన ఇతర మౌలిక వసతులను సమకూర్చాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలతోపాటు ఆయా రంగాలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సైతం పెట్టుబడుదారులకు వివరించి.. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాలని తెలిపారు.

భారీ పెట్టుబడులతో పాటు స్థానిక యువతకు అధిక స్థాయిలో ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫార్మా రంగం, చేనేత ఉత్పత్తులు, టెక్స్ టైల్ పార్కులు, ఐటీ పరిశ్రమలు, డేటా సెంటర్లు, డ్రైపోర్టులు సంబంధిత రంగాల్లో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని.. తెలంగాణ రైజింగ్-2047 విజన్‌కు వారు ఆకర్షితులవుతున్నందున అధికార యంత్రాంగం సైతం ప్రోత్సహించాలన్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ తదితర ఐటీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని అధికారులు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం, డెయిరీ ఉత్పత్తుల రంగంలోనూ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Next Story