- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలకు రూ.2 లక్షల వేతనాలు లభ్యం : మంత్రి వివేక్
జర్మనీ, జపాన్ దేశాల్లో నర్సులకు భారీ డిమాండ్ ఉందని, నెలకు రూ.2 లక్షల వరకు జీతాలు లభిస్తున్నాయని వివేక్ వెల్లడించారు.

జర్మనీ, జపాన్ లో నర్సులకు భారీ డిమాండ్
నెలకు రూ.2 లక్షల వేతనాలు లభ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి
దిశ, తెలంగాణ బ్యూరో : జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నర్సులకు భారీ డిమాండ్ ఉందని, నెలకు రూ.2 లక్షల వరకు జీతాలు లభిస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. జర్మనీలోని ఉద్యోగావకాశాలను అధ్యయనం చేయడానికి త్వరలోనే ఓ ప్రతినిధి బృందం పర్యటించనున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌లో నిర్మాణ రంగానికి అవసరమైన 1000 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, అక్కడ యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయిందన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే అవకాశాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం మాసబ్ ట్యాంక్‌లోని టీజీఐఐసీ భవనం ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ కలిసి పరిశీలించారు.
ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ ఈ భవనాన్ని టామ్ కామ్ కార్యాలయం కోసం లీజుకు తీసుకోవడంతో అక్కడకు వెళ్లారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్‌లో విదేశాల్లో ఉద్యోగాలు పొందే విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించేలా ఈ కార్యాలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో టామ్ కామ్ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో టామ్ కామ్ కోసం ప్రత్యేకంగా రూ.90 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
విదేశాలకు వెళ్లే అభ్యర్థులకు అక్కడి సంస్కృతి, భాష, జీవన విధానం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో చదివే విద్యార్థుల కోసం సీఎం ప్రవేశపెట్టిన రూ.2వేల స్కాలర్‌షిప్ పథకం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ కేంద్రాల్లో చదువుతున్న వారిలో ఆసక్తి ఉన్న అభ్యర్థులను గుర్తించి విదేశీ ఉపాధికి అనుగుణంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. టీజీఐఐసీ నుంచి లీజుకు తీసుకున్న ఈ భవనంలో విద్యార్థులకు సమగ్ర శిక్షణ అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. విదేశీ ఉద్యోగ అవకాశాలను ఆశించే యువత టామ్ కామ్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.






