- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hot News: ‘ప్రైవేటు’లో ఫీజుల మోత.. యాజమాన్యాల ఇష్టారాజ్యం
ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రతిఏటా ఇష్టారీతిన ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి. లక్షల్లో జీతాలు ఉన్న ఉద్యోగులు సైతం పిల్లల ఫీజులకే తమ ఆదాయం మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లల భవిష్యత్ బాగుండాలనే తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని స్కూల్ యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. నగరంలోని కొన్ని పాఠశాలలు అయితే ప్రతియేటా 20 నుంచి 30 శాతం వరకు ఫీజులను పెంచేస్తున్నాయి. ఐదేళ్లలోనే ఫీజు రెట్టింపు అవుతోంది. ఏ ఉద్యోగి వేతనం కూడా ఐదేళ్లలో రెట్టింపు కాదు. కానీ, స్కూల్ ఫీజులు మాత్రం రెట్టింపు కావడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్కూల్స్ ప్రారంభ సమయంలో హడావుడి చేయడం, ఆ తరువాత యథావిధిగా కొనసాగడం షరా మాములే.. తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, ఎవరెంత చెప్పినా ఫీజుల విషయంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని విమర్శలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్కూల్ ఫీజులకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని ఆరోపణలున్నాయి. స్కూల్ పేర్లతో మాయ చేసి ఇంటర్నేషనల్, నేషనల్, కేంబ్రిడ్జి స్కూల్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ బోధిస్తామని పేర్కొంటూ అధిక ఫీజులను అదనంగా యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి.
ఇంజినీరింగ్ కాలేజీల కన్నా ఎక్కువే..
రాష్ట్రంలో టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఉన్న ఫీజు కన్నా ప్రైవేటు స్కూళ్లలో ఫీజు ఎక్కువ ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లోని ఉన్నత విద్యావంతులు.. ల్యాబ్ ఫెసిలిటీస్ ప్రైవేట్ స్కూళ్లలో ఏమైనా అదనంగా ఉన్నాయా? అంటూ మండిపడుతున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు దాదాపుగా 13 ఏండ్ల పాటు ఫీజు చెల్లించుకుంటూ పోతుంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని, దీంతో అప్పుల పాలు కావడం ఖాయమని వారు ఆందోళన చెందుతున్నారు. సంపాదించిన దాంట్లో కనీసం రూపాయి కూడా పొదుపు చేయలేని పరిస్థితికి వస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజు ఒక్కటే కాదు...
స్కూల్ ఫీజు ఒక్కటే కాకుండా రకరకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక స్కూల్‌లో సీబీఎస్ఈ సిలబస్ అని, మరో స్కూల్ ఐసీఎస్ఈ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ స్టాండర్డ్ అని, లైబ్రరీ, కంప్యూటర్, అడిషనల్ క్లాసులు, ఐఐటీ, జేఈఈ కోచింగ్, ప్రైవేటు క్లాసులు, స్పెషల్ క్లాసులు, బిల్డింగ్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు ఇలా రకరకాలుగా ఫీజు వసూలు చేస్తున్నారు. వీటికి అదనంగా బస్సు, వ్యాన్ రవాణా ఫీజులు అదనం. వీటితో పాటుగా స్కూల్ డే, స్పోర్ట్స్ డే, కల్చరల్ యాక్టివిటి ఫీజులు, మరోవైపు యూనిఫాం వారి దగ్గరే కొనడం, వారు సూచించిన పుస్తకాలే కొనడం, స్పోర్ట్స్ యూనిఫాం, యేగా డే, ఇతర ప్రత్యేక రోజులకు వేలల్లో ఫీజులు, ఒకటేమిటి రకకరాల ఫీజుల పేరుతో తల్లిదండ్రుల రక్తం తాగుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. కొన్ని స్కూల్స్ అయితే ఏకంగా ఏసీ క్లాసు రూంలు, ఏసీ బస్సులు పెట్టి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి.
జీవోలన్నీ నీళ్లపాలు..
ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణ, స్కూల్ రవాణా వ్యవస్థ, విద్యా హక్కు చట్టం అమలుపై ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఏదో ఒక ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది. అయితే, జీవో రాగానే అందులో లోపాన్ని పట్టుకొని ప్రైవేట్ స్కూళ్లు కోర్టుకు వెళ్లడం స్టే తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. స్కూల్ ఫీజులపై ప్రభుత్వం 1994 జనవరి 1 జీవో నెంబర్ 1ని, 2009 జూన్ 18న జీవో నెంబర్ 376, 2009 ఆగస్టు 6న జీవో 91, స్కూల్ భవన నిర్మాణాలు ఏ విధంగా ఉండాలనే దానిపై 2008 సెప్టెంబర్ 27న జీవో 123ని, 2008 జూలై 7న ఎంత మంది విద్యార్థులు ఉంటే ఎంత మైదానం ఉండాలి అనే విషయాలపై జీవో 88ని విడుదల చేశారు. విద్యాహక్కు చట్టం కింద ఒక క్లాసులో 25 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, బీసీ, మైనార్టీలకు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటూ 2010 జూలై 30న జీవో 44 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. స్కూల్లలో అడ్మిషన్లకు విద్యార్థులకు ఎలాంటి ప్రవేశపరీక్ష పెట్టవద్దని విద్యాహక్కు చట్టం స్పష్టంచేస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం 2010 జూలై 30న జీవో నెంబర్ 42 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ జీవోలన్నీ జీరోలుగానే ఉంటున్నాయని.. అమలు ఎప్పుడంటూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.






