తెగి పడిపోయిన ఆస్పత్రిలో లిఫ్ట్.. మంత్రి అడ్లూరికి తప్పిన పెను ప్రమాదం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-13 17:06:14  IST  )

కరీంనగర్ ఆసుపత్రిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.

తెగి పడిపోయిన ఆస్పత్రిలో లిఫ్ట్.. మంత్రి అడ్లూరికి తప్పిన పెను ప్రమాదం
X

దిశ కరీంనగర్ బ్యూరో: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్ నగరంలోని ‘వన్’ ప్రైవేట్ ఆసుపత్రిలో లిఫ్ట్ ఒక్కసారిగా తెగి కిందపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన లారీ ప్రమాదంలో రాజయ్య అనే మొక్కజొన్న రైతు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న ఆ రైతును పరామర్శించేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇవాళ ఆసుపత్రికి వెళ్లారు. రైతు రాజయ్య థర్డ్ ఫ్లోర్‌లో ఉండటంతో, మంత్రి తన అనుచరులతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్ నుండి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, లిఫ్ట్ మొదటి అంతస్తుకు చేరుకోగానే ఒక్కసారిగా వైర్ తెగి కింద పడిపోయింది. మొదటి అంతస్తు నుండే కింద పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన మంత్రి అడ్లూరి, ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయిచేసుకున్నారు. కనీస నిర్వహణ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు.

Next Story