హైదరాబాద్‌కు మహర్దశ.. మారనున్న గ్రేటర్ ట్రాఫిక్ రూపురేఖలు

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్‌కు మహర్దశ.. మారనున్న గ్రేటర్ ట్రాఫిక్ రూపురేఖలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్) పరిధిలో రోడ్ల నెట్ వర్క్‌పై ఫోకస్ పెట్టింది. క్యూర్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి ప్యూర్ పరిధిలోని రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు అనుసంధానంగా ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మూడు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు. ఇప్పటికే రెండు కారిడార్ల పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఆధ్వర్యంలో రెండు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను చేపట్టనున్నారు. హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) కొత్తగా 49 మిస్సింగ్ లింకు రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు.

మూడు ఎలివేటెడ్ కారిడార్లు

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పెరగడంతో కాలుష్యం సైతం పెరుగుతోంది. దీంతోపాటు క్యూర్ నుంచి ప్యూర్ తొందరగా చేరుకోవడానికి అనుసంధానంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మూడు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో కారిడార్-1 పారడైస్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్డు వరకు రూ.1,478 కోట్లతో 5.40 కి.మీ కారిడార్ నిర్మించనున్నారు. దీనిలో 500 మీటర్ల వరకు అండర్ గ్రౌండ్ రోడ్డుతోపాటు 3.10 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్ ఉన్నది. కారిడార్-2 పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు రూ.4,263 కోట్లతో 18.18 కి.మీ కారిడార్ నిర్మించనున్నారు. దీనిలో 11.15 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్ ఉన్నది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కాస్టింగ్ యార్డు డెవలప్‌మెంట్ పనులు జరుగుతున్నాయి. కారిడార్-3 ఇంటి బంజారాహిల్స్‌లోని గ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల కారిడార్ నిర్మించనున్నారు. దీన్ని రూ.1656 కోట్లతో చేపట్టనున్నారు.

రెండు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు

హెచ్‌జీసీఎల్ ఆధ్వర్యంలో రెండు గ్రీన్ రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేడియల్ రోడ్ -1లో భాగంగా ఓఆర్ఆర్ రావిర్యాల నుంచి ట్రిపుల్ ఆర్ ఆమన్‌గల్ వరకు 41.5 కిలోమీటర్ల రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రేడియల్ రోడ్డు-2 ఓఆర్ఆర్ బుద్వేల్ నుంచి నాచారం జాతీయ రహదారి 167కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోడ్డు లగచర్ల, సీతారాంపూర్, చందన్ వెళ్లి పారిశ్రామిక వాడలను అనుసంధానం చేయనున్నారు.

49 మిస్సింగ్ లింకు రోడ్లు

క్యూర్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రం కావడంతో అత్యవసర పరిస్థితిల్లోనూ తొందరగా వెళ్లడం కష్టంగా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం మిస్సింగ్ లింకు రోడ్లను డిజైన్ చేసింది. మొదటి దశలో రూ.500 కోట్లతో 40.51 కిలోమీటర్ల మార్గంలోని 35 రోడ్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండో దశలో రూ.91.20 కోట్లతో 7.22 కిలోమీటర్ల రోడ్లకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతోపాటు మూడో దశలో రూ.1500 కోట్లతో 119.7 కిలోమీటర్ల మార్గంలో 49 రోడ్ల పనులు జరుగుతున్నాయి.

Next Story