- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్భుతమైన సేవలు.. అనూహ్యమైన ప్రగతి
హైదరాబాద్ నలుమూలలా విస్తృత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హెచ్ఏండీఏ భవనాలు, బహుళ అంతస్తులు, ఇళ్ల అవుట్‌లు, విల్లాస్ అనుమతులలో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లోనే అనుమతుల మంజూరు విషయంలో,

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నలుమూలలా విస్తృత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హెచ్ఏండీఏ భవనాలు, బహుళ అంతస్తులు, ఇళ్ల అవుట్‌లు, విల్లాస్ అనుమతులలో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లోనే అనుమతుల మంజూరు విషయంలో, ఆదాయంలో అద్భుతమైన పనితీరును ప్రదర్శించి ప్రజల మన్ననలు అందుకుంటోంది.
9 నెలల్లో.. 98 శాతం
ఈ ఏడాదిలో 6,079 దరఖాస్తులను పరిష్కరించారు. ఇది 2024లోని మొదటి 9 నెలలతో పోలిస్తే 49 శాతం, 2023తో పోలిస్తే 36 శాతం అధికం. భవన అనుమతుల కోసం మొత్తం 2,961 దరఖాస్తులు వచ్చాయి. ఇవి 2024తో పోలిస్తే 18 శాతం, 2023తో పోలిస్తే 8 శాతం పెరిగాయి. వీటిలో 2,904 పరిష్కారమయ్యాయి. మొత్తం దరఖాస్తుల ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్లకుపైగా బిల్ట్ అప్ ఏరియాకు అనుమతులు ఇచ్చారు.
3,677 కొత్త దరఖాస్తులు స్వీకరణ
2025లో హెచ్ఎండీఏ 3,677 కొత్త దరఖాస్తులను స్వీకరించింది. వీటిలో బహుళ అంతస్తుల భవనాల (ఎంఎస్బీ) అనుమతులు, ఓపెన్ ప్లాట్‌లతో లేఅవుట్, గృహాలతో లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన దరఖాస్తులున్నాయి. వీటిలో 2,887 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసి 79% దరఖాస్తులను ఆమోదించారు. 2024లో 3,209 కొత్త దరఖాస్తుల్లో 1,216 అనుమతులు ఇచ్చి 38%, 2023లో కొత్త దరఖాస్తులకు అనుమతులు ఇచ్చి 58% మాత్రమే ఆమోదించారు. 2023 ముందు కన్నా ఇప్పుడు అనుమతులు మంజూరు చేయడంలో గణనీయమైన వేగం పెరిగింది. ఫైళ్లు త్వరగా పరిష్కరించడంలో పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్న విధానం, ఎప్పటికప్పుడూ పరిశీలన, ప్రతి అధికారిని జవాబుదారీ చేయడం, కమిషనర్ స్థాయిలో రోజువారీ సమీక్ష వల్లే ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
రూ.1225 కోట్ల ఆదాయం
హెచ్ఎండీఏలో సంస్కరణల వల్ల ఆర్థికంగా చాలా సానుకూల ధోరణి కనిపిస్తుంది. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు పర్మిట్ ఫీజు వసూళ్లు రూ.1,225 కోట్లకు పెరిగాయి. ఇది 2024తో పోలిస్తే 245% (రూ.355 కోట్లు). 2023తో పోలిస్తే 82% (రూ.674 కోట్లు) గణనీయంగా పెరిగింది. 2025 సెప్టెంబర్‌లో మాత్రమే ఆదాయ వసూళ్లు రూ.132 కోట్లు కాగా ఇది సెప్టెంబర్ 2024తో పోలిస్తే 263% పెరుగుదల. ఇది మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు వనరుల సమీకరణ, మెరుగైన ప్రజా సేవల వల్లే సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.
హైరైజ్డ్ బిల్డింగ్స్
హెచ్ఎండీఏ పరిధిలో హైరైజ్డ్ బిల్డింగ్స్‌కు అనుమతులు పెరిగాయి. 2025 మొదటి తొమ్మిది నెలల్లో 77 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయగా 78.71 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతి లభించి.. రూ.514 కోట్ల ఆదాయాన్ని రికార్డు స్థాయిలో హెచ్ఎండీఏ పొందింది. 2023లో కేవలం 55 దరఖాస్తులు మాత్రమే మంజూరయ్యాయి. అప్పుడు నిర్మాణ విస్తీర్ణం 37.03 లక్షల చదరపు మీటర్లు కాగా, ఆదాయం రూ.215 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది వృద్ధి గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నగర విస్తరణలో భాగంగా, గండిపేట్ మండల పరిధిలోని కొన్ని కీలక ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఇటీవల భారీ మల్టీ-స్టోరీడ్ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు నగర రూపురేఖలను మరిచేలా కీలకంగా నిలుస్తున్నాయి.
- కోకాపేట్‌లో 2.17 ఎకరాల విస్తీర్ణంలో బ్లాక్ నిర్మాణానికి అనుమతి లభించింది. ఇది 5 సెల్లార్లు + గ్రౌండ్ + 63 అంతస్తులు కలిగి ఉంటుంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 15,45,994 చదరపు అడుగులు, యూనిట్లు: 362.
- కోకాపేట్‌లో మరో ప్రాజెక్టు 7.71 ఎకరాలు, 5 బ్లాకులు, ప్రతి బ్లాక్ 4 సెల్లార్లు + గ్రౌండ్ + 56 అంతస్తులు. నిర్మాణ విస్తీర్ణం 55,44,206 చదరపు అడుగులు, యూనిట్లు: 656
- బండ్లగూడ జగీర్ గ్రామంలో 3.22 ఎకరాల ప్రాజెక్టులో 2 బ్లాకులు, 3 సెల్లార్లు + స్టిల్ట్ + 30 అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం 15,03,090 చదరపు అడుగులు, యూనిట్లు: 446
- బండ్లగూడ జగీర్‌లో 2.34 ఎకరాల ప్రాజెక్ట్, 1 బ్లాక్, 2 సెల్లార్లు + 5 పొడియం + 47 అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం 13,51,476 చదరపు అడుగులు, యూనిట్లు: 344.
- కోకాపేట్‌లో మరో ప్రధాన ప్రాజెక్టు 9.71 ఎకరాలు, 3 బ్లాకులు. ఇందులో 2 రెసిడెన్షియల్ బ్లాకులు (5 సెల్లార్లు + గ్రౌండ్ + 57 అంతస్తులు).. ఒక కమర్షియల్ బ్లాక్ (5 సెల్లార్లు + గ్రౌండ్ + 49 అంతస్తులు) ఉన్నాయి. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 66,03,556 చదరపు అడుగులు, యూనిట్లు: 594
2,862 ఎకరాల్లో లేఅవుట్ పర్మిషన్లు
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 2,862 ఎకరాల్లో ఓపెన్ ప్లాట్‌లకు సంబంధించిన లేఅవుట్ అనుమతులు మంజూరు చేసింది. 2024తో పోల్చితే 512% వృద్ధి సాధించింది. హౌసింగ్‌తో కూడిన లేఅవుట్లు 38.24 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణానికి చేరాయి. 2024తో పోల్చితే 186% వృద్ధి పెరిగింది. బిల్డింగ్ అనుమతుల ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్ల అభివృద్ధికి ఆమోదం లభించింది. 2024తో పోల్చితే 239%, 2023తో పోల్చితే 87% పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
పరిష్కారంలో వేగం పెంచాం
హెచ్ఎండీఏలో పని వేగం పెరగడంతో పాటు తక్కువ సమయంలో దరఖాస్తులను పరిష్కరించడం, ప్రతి దరఖాస్తుకు తగిన ప్రతిస్పందన ఇచ్చేలా చూడడం, సరైన సమాచారాన్ని తగిన రీతిలో పంచుకోవడం వంటి చర్యలు చేపట్టాం. ఇది ప్రజల్లో సంతృప్తిని పెంచింది. 30 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను కఠినమైన మానిటరింగ్, నిరంతర ఫాలో అప్ ద్వారా 2 శాతంలోపు తగ్గించగలిగాం. పూర్తిగా పెండింగ్ లేకుండా చేసేందుకు మరిన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండీఏ వేగవంతమైన పురోగతి వెనుక సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన దార్శనికత, ప్రోత్సాహకరమైన మద్దతు, అధికారుల అహర్నిశ శ్రమ ఉంది.
సర్ఫరాజ్ అహ్మద్ - మెట్రోపాలిటన్ కమిషనర్






