- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HMDA: హెచ్ఎండీఏలో ఆ లీడర్ హల్‌చల్..! ఏకంగా సీఎం పేరుతో పైరవీలు
‘సీఎం నాకు చాలా క్లోజ్’ అని చెప్పి ఓ నామినేటెడ్ చైర్మన్ హెచ్‌ఎండీఏలో హల్‌చల్ చేస్తున్నట్టు ప్రచారం జరగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘సీఎం నాకు చాలా క్లోజ్’ అని చెప్పి ఓ నామినేటెడ్ చైర్మన్ హెచ్‌ఎండీఏలో హల్‌చల్ చేస్తున్నట్టు ప్రచారం జరగుతున్నది. హెచ్ఎండీఏ కార్యకలాపాల్లో సదరు పొలిటికల్ లీడర్ ప్రమేయం రోజురోజుకూ పెరిగిపోతున్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పలు కీలకమైన ఫైల్స్‌ను మూవ్ చేయాలంటే సదరు నేత పాత్ర కీలకమనే చర్చ జరుగుతున్నది. ఆ నాయకుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే చాలు.. ఎంతటి క్లిష్టమైన పని అయినా క్షణాల్లో పూర్తవుతున్నదని టాక్. అందుకే చాలా మంది రియల్టర్లు, బిల్డర్లు ఆ లీడర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.
ఏ పని ఉన్నా చేసి పెడతా..
అధికార పార్టీలో ఆయన ఓ సాధారణ లీడర్. కానీ, ఆ మధ్య జరిగిన నామినేటెడ్ పదవుల పంపకంలో ఆ లీడర్‌కు మైనార్టీ శాఖకు చెందిన ఓ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన ఆ సంస్థ కార్యకలాపాలను పట్టించుకుంటారని అందరూ భావించారు. కానీ, ఆయన తన సొంత సంస్థ వ్యవహారాలను పక్కన పెట్టి, హెచ్ఎండీఏ యాక్టివిటీస్‌లో జోక్యం చేసుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. పెద్ద పెద్ద వెంచర్ల అనుమతులు, బిల్డింగ్ పర్మిషన్లు ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తన వద్దకు వివిధ పనుల కోసం వచ్చే రియల్టర్లు, బిల్డర్ల వద్ద గొప్పలు చెబుతున్నట్టు విమర్శలొస్తున్నాయి. ‘నేను సీఎం అన్నకు చాలా క్లోజ్.. హెచ్ఎండీఏలో ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతా.. ఎలాంటి పని అయిన క్షణాల్లో పూర్తి చేసుకొస్తా’.. అని వివరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే చాలా మంది బిల్డర్లు, రియల్టర్లు ఆయన్ను కలిసేందుకు క్యూ కడుతున్నారని తెలుస్తున్నది.
హెచ్ఎండీఏ సహకారం..
సీఎంకు సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసి సదరు లీడర్‌కు హెచ్ఎండీఏలోని కీలక అధికారులు సైతం సహకరిస్తున్నట్టు టాక్. ఆ లీడర్‌కు సంస్థలోని ఇతర అధికారులు, సిబ్బంది గౌరవ మర్యాదలు ఇవ్వడంతో పాటు ఆయన దృష్టిలో పడేందుకు తాపత్రాయపడుతున్నట్టు తెలుస్తున్నది. సదరు లీడర్ వ్యవహార తీరుపై కాంగ్రెస్ లీడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతనికి హెచ్ఎండీఏ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన్ను అక్కడ ఎంకరేజ్ చేయడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని కొందరు సీనియర్లు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






