- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పైగా ప్యాలెస్‌కు హెచ్ఎండీఏ ఆఫీసు.. మార్చిలో తరలించడానికి కసరత్తు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ) హెడ్ ఆఫీసుకు బేగంపేట్ లోని పైగా ప్యాలెస్ కు తరలించనున్నారు. అయితే గతంలో పైగా ప్యాలెస్ ను హైడ్రా ప్రధాన కార్యాలయానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ) హెడ్ ఆఫీసుకు బేగంపేట్ లోని పైగా ప్యాలెస్ కు తరలించనున్నారు. అయితే గతంలో పైగా ప్యాలెస్ ను హైడ్రా ప్రధాన కార్యాలయానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే రూ.70కోట్లతో మరమత్తులు చేయాలని నిర్ణయించారు. కానీ హైడ్రా ఆఫీసును బుద్ధభవన్ లో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పైగా ప్యాలెస్ కు హెచ్ఎండీఏ ఆఫీసుకు తరలించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే పైగా ప్యాలెస్ రిపేర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మార్చి నుంచి తరలించే పనులు ప్రారంభమైతే జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే 15ఏండ్లకు క్రితం పైగా ప్యాలెస్ లోనే హెచ్ఎండీఏ ఆఫీసు ఉన్నదని, తిరిగి మళ్లీ అక్కడే వెళ్లనుందని అధికారులు చెబుతున్నారు. దీంతో స్వర్ణజయంతి కాంప్లెక్స్ ను మళ్లీ రెంట్ కు ఇవ్వాలని నిర్ణయించారు.
1900లో నిర్మాణం….
బేగంపేట చిరాన్‌లేన్‌లోని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పైగా ప్యాలెస్ రాజభవన్ లా ఉంటుంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పని చేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్ నిర్మించారు. ఉమ్రా పైగా వంశానికి చెందినవారు కావడంతో దీనికి పైగా ప్యాలెస్ గా గుర్తించారు. అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలిలో ప్యాలెస్ నిర్మించారు. ఈ ప్యాలెస్ కు 22 అడుగుల ఎత్తయిన పైకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులున్నాయి.
హుడా ఆఫీసు ఇక్కడే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1975లో హైదరాబాద్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హుడా) ఏర్పాటు చేశారు. హుడా ఆఫీసును మొదటగా పైగా ప్యాలెస్ లో నే ఏర్పాటు చేశారు. నిజాం పాలన తర్వాత పైగా ప్యాలెస్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో హుడా ఆఫీసుకు ఇచ్చారు. హుడాకు తొలి చైర్‌పర్సన్‌గా సరోజినీ పుల్లారెడ్డి ఉండగా, తొలి వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి వసంత్ బవాను ప్రభుత్వం నియమించింది. హుడాను 7జిల్లాలతో కలిపి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డవలప్ మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ)గా ఏర్పాటు చేశారు. అయితే హుడా ఆఫీసు(పైగా ప్యాలెస్)ను అమెరికన్ కాన్సులేట్ ఆఫీసుకు అప్పగించారు. దీంతో హెచ్ఎండీఏ ఆఫీసును తార్నాకలోని హుడా కాంప్లెక్స్ లోకి తరలించారు. 12ఏండ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆఫీసులోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ లోకి తరలించింది. ఇక్కడి నుంచి హెచ్ఎండీఏ ఆఫీసును మళ్లీ పైగా ప్యాలెస్ కు తరలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
హెచ్ఓడీలకు మాత్రమే…
పైగా ప్యాలెస్ ను పూర్తి స్థాయిలో మరమత్తులు పూర్తయ్యేవరకు అన్ని విభాగాల హెచ్ఓడీలకు మాత్రమే ఆఫీసులు కేటాయించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ కమిషనర్ కు మెట్రోరైలు ఎండీగా బాధ్యతలు అప్పగిండంతో బేగంపేట్ లోని మెట్రో భవన్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. మీటింగ్ లు కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. దీంతో అమీర్ పేట్ నుంచి బేగంపేట్ కు రావడానికి సమయం వృధా అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే పైగా ప్యాలెస్ లో హెచ్ఓడీలు ఉంటే బేగంపేట్ లోని మెట్రోభవన్ రావడం సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే పైగా ప్యాలెస్ మరమత్తులు స్పీడ్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు.
అర్బన్ ఫారెస్ట్రీ, హెచ్జీసీఎల్ ఆఫీసులు…
హెచ్ఎండీఏలో కీలక విభాగాలైన అర్బన్ ఫారెస్ట్రీ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్జీసీఎల్) ఆఫీసులు నానక్ రాంగుడలో ఉన్నాయి. ఈ రెండింటిని కూడా పైగా ప్యాలెస్ కు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యంగా అర్బన్ ఫారెస్ట్రీ ఆఫీసును మాత్రం పూర్తి స్థాయిలో తీసుకురావాలని నిర్ణయించారు. హెచ్జీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) ఆఫీసుతోపాటు కొంత మంది స్టాఫ్ ను కూడా పైగా ప్యాలెస్ లో ఉండేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నుంచి అన్ని విభాగాల తరలింపు కార్యక్రమం ప్రారంభమవుతోందని, అన్నివిభాగాలను తరలించడానికి కనీసం ఆరునెలలు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.






