హెచ్ఎండీఏ మెగా మాస్టర్ ప్లాన్.. ప్రాజెక్టుల కోసం రూ.20,000 కోట్ల వేట!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-08 01:26:11  IST  )

హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల వంటి భారీ ప్రాజెక్టుల కోసం రూ. 20,000 కోట్ల నిధుల సేకరణకు హెచ్ఎండీఏ (HMDA) సిద్ధమైంది.

హెచ్ఎండీఏ మెగా మాస్టర్ ప్లాన్.. ప్రాజెక్టుల కోసం రూ.20,000 కోట్ల వేట!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ఎలివేటెడ్ కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నుంచి ట్రిపుల్ఆర్ వరకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు, ఐసీసీసీ నుంచి ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) బాండ్లు, రుణాల ద్వారా రూ.20 వేల కోట్లు సేకరించాలని నిర్ణయించింది. అందుకోసం ‘ట్రస్టు కాపిటల్’ అనే సలహాదారు/మర్చంట్ బ్యాంకును నియమించుకున్న విషయం తెలిసిందే. అయితే రూ.20 వేల కోట్లలో భాగంగానే మొదటి దశలో రూ.5 వేల కోట్ల రుణాన్ని తీసుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. అయితే మొదటి దశలో బాండ్ల ద్వారా రూ.3,400 కోట్లను సేకరించారు.

రూ.2 వేల కోట్ల ఆదాయం

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ విస్తరించిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలో లేఅవుట్లకు అనుతులు జారీచేయడం, బిల్డింగ్స్ పర్మిషన్లు, ఓసీ సర్టిఫికెట్ల జారీ వంటి కార్యక్రమాలు చేపడుతున్న ప్లానింగ్ విభాగం ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్లానింగ్ ద్వారా వచ్చే ఆదాయానికి ప్రత్యేకంగా ‘ఎస్క్రో’ అకౌంట్ ఓపెన్ చేసి రూ.500 కోట్లు చూపెడితే బాండ్ల రూపంలోగానీ, రుణాల రూపంలోగా రూ.5 వేల కోట్లు సేకరించడానికి అవకాశముంది. అయితే కోకాపేట, బుద్వేల్‌, మోకిల్లా, బాచుపల్లి, మేడిపల్లి, బహదూర్‌పల్లి, తొర్రూర్‌, కుర్మల్‌గూడ, తుర్కయాంజల్‌ తదితర ప్రాంతాల్లో వందల ఎకరాలను లేఅవుట్లుగా తీర్చిదిద్ది విక్రయించడం ద్వారా సుమారు రూ.13 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. దీంతోపాటు ఓఆర్‌ఆర్‌ను రూ.7,380 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ ద్వారా ప్రభుత్వానికి రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని అందించింది. కానీ గత ప్రభుత్వం ఈ నిధులను ఇతర ప్రభుత్వ పథకాలకు వినియోగించింది. ఫలితంగా హెచ్ఎండీఏ ప్రస్తుతం అప్పులు తీసుకునే స్థాయికి దిగజారిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టులు ఇలా..

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే అప్పులు తీసుకోకతప్పదు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.5,106 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్లు, రూ.4,030 కోట్లతో ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణాలను చేపట్టనుంది. బంజారాహిల్స్ ఐసీసీసీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు రూ.1,656 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్, రూ.488 కోట్లతో బుద్వెల్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్, రూ.110 కోట్లతో ఎంజీఐటీ-మణికొండ రోడ్డు విస్తరణ, రూ.26.50 కోట్లతో నానక్‌రాంగూడ నుంచి గచ్చిబౌలి వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసిన విషయ తెలిసిందే.

బాండ్ల ద్వారా రూ.3,400 కోట్లు

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.20 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీని సైతం నియమించుకుంది. ఈ రూ.20 వేల కోట్లను దశలవారీగా సేకరించాలని నిర్ణయించారు. మొదటి దశలో రూ.5 వేల కోట్లను బాండ్ల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. కానీ రూ.3,400 కోట్లను మాత్రమే సేకరించారు. మరో రూ.1600 కోట్లను సైతం త్వరలోనే సేకరించే అవకాశముంది.

Next Story