- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనూహ్యమైన ప్రగతిలో HMDA.. రికార్డు స్థాయిలో కోట్లలో ఆదాయం
నగరం నలుమూలల విస్తృత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హెచ్ఎండీఏ అనూహ్యమైన ప్రగతి సాధిస్తూ, వేగవంతమైన పనితీరుతో ముందూ దూసుకుపోతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: నగరం నలుమూలల విస్తృత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హెచ్ఎండీఏ అనూహ్యమైన ప్రగతి సాధిస్తూ, వేగవంతమైన పనితీరుతో ముందూ దూసుకుపోతోంది. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్ల లేఔట్ లు, విల్లా లేఔట్ ల అనుమతులలో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది. గత సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలలలోనే అనుమతుల మంజూరు విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ అద్భుతమైన పనితీరును ప్రదర్శించి ప్రజల మన్ననలు అందుకుంటోంది.
9నెలల్లో.. 98శాతం
ఈ ఏడాదిలో 6,079 దరఖాస్తులను పరిష్కరించారు. ఇది 2024లోని మొదటి తొమ్మిది నెలల తో పోలిస్తే 49 శాతం, 2023 తో పోలిస్తే 36 శాతం అధికం. భవన అనుమతుల కోసం మొత్తం 2,961 దరఖాస్తులు వచ్చాయి. వీటి సంఖ్య 2024తో పోలిస్తే 18 శాతం, 2023తో పోలిస్తే 8 శాతం పెరిగాయి. వాటిలో 2,904 పరిష్కారం అయ్యాయి. అంటే 98 శాతానికి పైగా పరిష్కారం అయ్యాయి. (2024తో పోలిస్తే 47 శాతం, 2023తో పోలిస్తే 26 శాతం బిల్డింగ్ అనుమతులు పెరిగాయి). మొత్తం ఈ దరఖాస్తుల ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్లకుపైగా బిల్ట్ అప్ ఏరియాకు అనుమతులు ఇవ్వడం జరిగింది. హెచ్ఎండీఏ 2025లో 3,677 కొత్త దరఖాస్తులను స్వీకరించింది. వీటిలో బహుళ అంతస్తుల భవనాల (ఎంఎస్బీ) అనుమతులు, ఓపెన్ ప్లాట్‌లతో లేఅవుట్, గృహాలతో లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. వీటిలో 2,887 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసి 79 శాతం దరఖాస్తులను ఆమోదించారు. 2024లో 3,209 కొత్త దరఖాస్తులలో 1,216 అనుమతులు ఇచ్చి 38 శాతం, 2023లో కొత్త దరఖాస్తులకు అనుమతులను ఇవ్వడంలో 58 శాతం మాత్రమే ఆమోదించారు. 2023 ముందు కన్నా ఇప్పుడు అనుమతులు మంజూరు చేయడంలో గణనీయమైన వేగం పెరిగింది. నిర్మాణదారులకు, ప్రజలకు తమ సంస్థ ఒక నమ్మకాన్ని కలిగించడానికి గణాంకాలే నిదర్శనం.
పటిష్టమైన పర్యవేక్షణ - జవాబుదారీతనం..
ఫైళ్ళను త్వరితగతిన పరిష్కరించడంలో ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్న విధానం. ఎప్పటికప్పుడు పరిశీలన, ఇందుకు సంబంధించి ప్రతి అధికారిని జవాబుదారీ చేయడం, కమిషనర్ స్థాయిలో రోజువారీ వాటిని సమీక్షించడంతోనే ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం పెండింగ్ ఫైళ్ళను ఒక నిర్ధిష్ట కాలపరమితి ప్రకారం విభజించి వాటిని పరిశీలించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేశారు. 60 రోజులకుపైగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు, 30 నుండి 60 రోజులుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు, 30 రోజుల లోపు పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు, వారం రోజులుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు గా మొత్తం ఫైళ్ళను విభజించుకుని, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే విధానాన్ని అమలు చేస్తోంది. మొత్తం దరఖాస్తుల రావడం, వాటిని పరిష్కరించడం తమ పని విధానంలో చాలా ముఖ్యంగా భావించడంతోనే ఫలితాలు సాధించగలిగామని అధికారులు ప్లానింగ్ చెబుతున్నారు.
రూ.1225కోట్ల ఆదాయం..
హెచ్ఎండీఏలో సంస్కరణల వల్ల ఆర్థికంగా కూడా చాలా సానుకూల ధోరణి కనిపిస్తుంది. 2025 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో పర్మిట్ ఫీజు వసూళ్లు రూ.1,225 కోట్లకు పెరిగాయి, ఇది 2024తో పోలిస్తే 245శాతం (రూ.355 కోట్లు). 2023తో పోలిస్తే 82శాతం (రూ.674 కోట్లు) గణనీయంగా పెరిగింది. 2025 సెప్టెంబర్‌లో మాత్రమే ఆదాయ వసూళ్లు రూ. 132 కోట్లు, ఇది సెప్టెంబర్ 2024తో పోలిస్తే 263శాతం పెరుగుదల. ఇది మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు, వనరుల సమీకరణ, మెరుగైన ప్రజా సేవలకు అద్దం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
హైరైజ్డ్ బిల్డింగ్స్..
హెచ్ఎండీఏ పరిధిలో హైరైజ్డ్ బిల్డింగ్స్ కు సంబంధించిన అనుమతులు పెరగాయి. 2025 మొదటి తొమ్మిది నెలల్లో 77 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశారు. వీటి ద్వారా 78.71 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతి లభించగా, రూ.514 కోట్ల ఆదాయాన్ని రికార్డు స్థాయిలో హెచ్ఎండీఏ పొందింది. ఇదే కాలంలో 2023లో కేవలం 55 దరఖాస్తులు మాత్రమే మంజూరయ్యాయి. అప్పుడు నిర్మాణ విస్తీర్ణం 37.03 లక్షల చదరపు మీటర్లు కాగా, ఆదాయం రూ.215 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది వృద్ధి గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నగర విస్తరణలో భాగంగా, గండిపేట్ మండల పరిధిలోని కొన్ని కీలక ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఇటీవల భారీ మల్టీ-స్టోరీడ్ నిర్మాణాలకు ఇటీవల కాలంలో కొన్ని అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు నగర రూపురేఖలను మరచేలా కీలకంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు హైదరాబాద్ నగరానికి కొత్త ఆకృతి, ఆధునికత, మరియు ఆకాశాన్ని తాకే నిర్మాణ శైలిని అందిస్తున్నాయి. అనుమతులు, ఆదాయ పరంగా గత రెండు సంవత్సరాల్లో హెచ్ఎండీఏ ప్రగతి రెట్టింపు స్థాయికి చేరింది. ఇది పెరుగుతున్న డిమాండ్‌ను, హెచ్ఎండీఏ పారదర్శక విధానాలపై ప్రజల విశ్వాసాన్ని, అభివృద్ధి ప్రాజెక్టుల క్లియరెన్స్‌లో ఉన్న వేగాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యమైన ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి.
- కొకాపేట్ గ్రామంలో 2.17 ఎకరాల విస్తీర్ణంలో ఒక బ్లాక్ నిర్మాణానికి అనుమతి లభించింది.
- ఇది 5 సెల్లార్లు + గ్రౌండ్ + 63 అంతస్తులు కలిగి ఉంటుంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 15,45,994 చదరపు అడుగులు, యూనిట్లు: 362.
- కొకాపేట్‌లో మరో ప్రాజెక్ట్ 7.71 ఎకరాలు, 5 బ్లాకులు, ప్రతి బ్లాక్ 4 సెల్లార్లు + గ్రౌండ్ + 56 అంతస్తులు. నిర్మాణ విస్తీర్ణం 55,44,206 చదరపు అడుగులు, యూనిట్లు: 656
- బండ్లగూడ జగీర్ గ్రామంలో 3.22 ఎకరాల ప్రాజెక్ట్‌లో 2 బ్లాకులు, 3 సెల్లార్లు + స్టిల్ట్ + 30 అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం 15,03,090 చదరపు అడుగులు, యూనిట్లు: 446
- బండ్లగూడ జగీర్‌లో 2.34 ఎకరాల ప్రాజెక్ట్, 1 బ్లాక్, 2 సెల్లార్లు + 5 పొడియం + 47 అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం 13,51,476 చదరపు అడుగులు, యూనిట్లు: 344.
- కొకాపేట్‌లో మరో ప్రధాన ప్రాజెక్ట్ 9.71 ఎకరాలు, 3 బ్లాకులు—ఇందులో 2 రెసిడెన్షియల్ బ్లాకులు (5 సెల్లార్లు + గ్రౌండ్ + 57 అంతస్తులు) మరియు 1 కమర్షియల్ బ్లాక్ (5 - సెల్లార్లు + గ్రౌండ్ + 49 అంతస్తులు) ఉన్నాయి. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 66,03,556 చదరపు అడుగులు, యూనిట్లు: 594
2862 ఎకరాల్లో లేఅవుట్ పర్మిషన్లు..
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 2,862ఎకరాల్లో ఓపెన్ ప్లాట్‌లకు సంబంధించిన లేఅవుట్ అనుమతులు మంజూరు చేసింది. 2024తో పోల్చితే 512శాతం వృద్ధి సాధించింది. హౌసింగ్‌తో కూడిన లేఅవుట్లు 38.24 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణానికి చేరాయి. 2024తో పోల్చితే 186శాతం వృద్ధి పెరిగింది. బిల్డింగ్ అనుమతుల ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్ల అభివృద్ధికి ఆమోదం లభించింది. 2024తో పోల్చితే 239శాతం, 2023తో పోల్చితే 87శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ అసాధారణ ఆదాయ వనరులు హైదరాబాద్ నగర ప్రణాళికకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయని, రోడ్లు, ప్రజా సౌకర్యాలు, పచ్చదన ప్రదేశాలకు ఇది కొత్త శక్తినిస్తుందని ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు.






