- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్టర్ ప్లాన్ 2050 : లేఅవుట్లు, స్కైవాక్స్, రోడ్లతో నగర అభివృద్ధికి చర్యలు
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయని, రక్షణశాఖ భూములను హెచ్ఎండీఏకు బదలాయించడానికి ఒప్పందం చేసుకోవడం కీలక పరిణామమని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయని, రక్షణశాఖ భూములను హెచ్ఎండీఏకు బదలాయించడానికి ఒప్పందం చేసుకోవడం కీలక పరిణామమని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో రక్షణశాఖకు చెందిన 142 ఎకరాలను సేకరించడంతో తిరిగి రక్షణశాఖకు జవహర్ నగర్ లోని 435 ఎకరాల హెచ్ఎండీఏ భూములను ఇవ్వనున్నట్టు తెలిపారు. గురువారం అమీర్ పేట్ లోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రావిర్యాల రతన్ టాటా ఇంటర్ ఛేంజ్ నుంచి ఆమనగల్లు వరకు నిర్వహించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, కోర్టు కేసుల కారణంగా పనులు ప్రారంభించలేదన్నారు. ఈ ప్రాజెక్టులో 231 రిజర్వ్ ఫారెస్టు భూములను సేకరించామని, వీటికి బదులుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలోని రెవెన్యూ భూములు ఇవ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఆ భూముల్లో పెద్ద పెద్ద లే అవుట్లు
కంది, ఫసల్ వాడీ, పెద్దకంజర్లలో లే అవుట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఇప్పటికే ప్రతాపసింగారం, బాచుపల్లి, ఇనుముల్ నర్వ, లేమూరు ప్రాంతాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేశామని తెలిపారు. రైతులతో చర్చించి భూములు తీసుకుంటున్నామన్నారు. దీంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను సేకరించి పెద్ద పెద్ద లేఅవుట్లు చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు. సంస్థకు చెందిన భూములు, లేఅవుట్లలో 10శాతం మార్ట్ గేజ్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని రక్షించేందుకు రెంట్, లీజ్ వంటి విధానంలో ఆదాయాన్ని రాబట్టుకుంటామన్నారు.
4 స్కై వాక్స్ ఏర్పాటు
నగరంలో నాలుగు స్కైవాక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని కమిషనర్ చెప్పారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మెట్రోరైలు ప్రాజెక్టు ఈస్ట్, వెస్ట్ స్టేషన్లతో పాటు రేతిఫైల్, సికింద్రాబాద్, కీస్ హైస్కూల్ బస్టాప్ ను కలిపేలా స్కైవాక్ రూపొందించామని చెప్పారు. కూకట్ పల్లి జేఎన్టీయూ నుంచి మెట్రోస్టేషన్ వరకు, జేఎన్టీయూ నుంచి ప్రగతినగర్ మార్గంలో వెళ్లేందుకు పాదచారుల కోసం స్కైవాక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఉప్పల్ వెళ్లే మార్గం(ఎడమ)లో శ్మశానవాటిక ఉండటంతో స్కైవాక్ ఏర్పాటు చేయకలేకపోయామని, దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో అక్కడ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మెహిదీపట్నం స్కైవాక్ ను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2026లోనే మాస్టర్ ప్లాన్
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 పనులు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పూర్తికానుందని కమిషనర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ఎకానమిక్ డవపల్ మెంట్ ప్లాన్, బ్లూ, గ్రీన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్లాన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఎకానమిక్ డెవలప్ మెంట్ ప్లాన్ కు సంబంధించిన అనేక రకాల సలహాలు, సూచనలు వచ్చాయని చెప్పారు.
ఫైళ్లు పెండింగ్ అవాస్తవం
హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్లు, ఆక్యూపెన్సీ(ఓసీ) సర్టిఫికెట్లకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని ప్రచారం జరుగుతున్నదని, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని, అందుకు ఇచ్చిన పర్మిషన్లే నిదర్శనమని చెప్పారు. రెండేండ్లతో పొలిస్తే ఈ ఏడాదిలో జూన్ వరకు అధిక దరఖాస్తులను క్లియర్ చేశామని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ లేఅవుట్లలోని స్థలాల్లో కొత్తగా పార్కులను ఏర్పాటుచేశామని, మరికొన్నింటిని ఏర్పాటుచేస్తామన్నారు. 19 కొత్త పార్కులకు స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. పలు కాలనీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.






