హిజ్రాల ఆగడాలు.. దేవుళ్లకే శాపమా?

by Ajay Maddhiboyina |

డిండిరోడ్డుపై వినాయ‌క విగ్ర‌హాల‌ను త‌ర‌లిస్తున్న ప్ర‌తి వాహ‌నానికి అడ్డుప‌డి డ‌బ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వ‌క‌పోతే క‌ద‌ల‌నివ్వం అంటూ తిడుతూ అడ్డంగా నిల‌బ‌డ్డారు.

హిజ్రాల ఆగడాలు.. దేవుళ్లకే శాపమా?
X

దిశ‌, వెబ్ డెస్క్: హిజ్రాల ఆగ‌డాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హిజ్రాలు అర్ధ నారిశ్వ‌రులు అని వాళ్లు దీవిస్తే మంచి జ‌రుగుతుంద‌ని అంటుంటారు. ఈ నేప‌థ్యంలోనే వారిని గృహ‌ప్ర‌వేశాల‌కు, షాప్ ఓపెనింగ్ లాంటి శుభ‌కార్యాల‌కు పిలిచి ఆశ్వీర్వాదం తీసుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. పిల‌వ‌కుండానే పెళ్లైనా, పేరంట‌మైనా ఇంట్లో చిన్న పండగ చేసుకున్నా అక్క‌డ‌కు వ‌చ్చి డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నారు. బంధులువులు, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎంతో ఆనందంగా గ‌డుపుతున్న స‌మ‌యంలో వ‌చ్చి డ‌బ్బులు ఇవ్వాల్సిందేన‌ని గొడ‌వ‌లకు దిగుతున్నారు. అది కూడా వందో రెండు వంద‌లో కాకుండా ఏకంగా వేల‌ల్లో డిమాండ్ చేస్తూ ఇచ్చేవ‌ర‌కు అక్క‌డ నుండి క‌ద‌ల‌డం లేదు.

పెళ్లికో రేటు, గృహ‌ప్ర‌వేశానికో రేటు అంటూ డ‌బ్బులు వసూలు చేస్తున్నారు. ఉన్నోళ్లు లేనోళ్లు అని చూడ‌కుండా ఇవ్వాల్సిందే అని ప‌ట్టుబ‌డుతున్నారు. ఒక‌వేళ డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే శాప‌నార్థాలు పెట్ట‌డం, తిట్ట‌డం చివ‌రికి బ‌ట్ట‌లు విప్పడం లాంటివి చేస్తూ భ‌యాందోళ‌న‌క‌ర వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నారు. కొన్నిచోట్ల దాడుల‌కు దిగుతున్న సంద‌ర్భాలు కూడా క‌నిపిస్తున్నాయి. ప‌ట్ట‌ణాలు, గ్రామాలు అని తేడా లేకుండా ఎక్క‌డ చూసినా వీరి ఆగ‌డాల‌కు ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్క‌డ శుభ‌కార్యం జ‌రిగినా తెలిసేలా స‌మాచారం ఇచ్చేందుకు స్థానికంగా ఉండేవారితో మంచి సంబంధాలు ఏర్ప‌రుచుకుని ఫంక్ష‌న్ ఉంద‌ని కాల్ చేయ‌గానే వాలిపోతున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా చాలా ఘ‌ట‌న‌ల్లో వారు ప‌ట్టించుకోక‌పోవ‌డం వారికి మామూళ్లు అందుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. నిజానికి హిజ్రాల‌కు బ‌య‌ప‌డేది వారు శ‌పిస్తే చెడు జ‌రుగుతుంది అనే ఓ న‌మ్మ‌కంతో. కానీ ఇప్పుడు చెడు జ‌రిగినా ప‌ర్లేదు కానీ ఆగ‌డాల‌ను భ‌రించ‌లేమ‌ని అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌నే ఇబ్బంది పెట్టిన హిజ్రాల ఆగ‌డాలు దేవుళ్ల వ‌ర‌కు వెళ్లాయి. న‌ల్గొండ జిల్లా దేవ‌ర‌కొండ ప‌ట్ట‌ణంలో వినాయ‌క విగ్ర‌హాల కొనుగోలు కేంద్రాల వ‌ద్ద హిజ్రాలు హ‌ల్ చ‌ల్ చేశారు. డిండిరోడ్డుపై వినాయ‌క విగ్ర‌హాల‌ను త‌ర‌లిస్తున్న ప్ర‌తి వాహ‌నానికి అడ్డుప‌డి డ‌బ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వ‌క‌పోతే క‌ద‌ల‌నివ్వం అంటూ తిడుతూ అడ్డంగా నిల‌బ‌డ్డారు. దీంతో వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన‌ వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో మ‌నుషుల‌కే కాకుండా దేవుళ్ల‌కు సైతం హిజ్రాల శాపాలు పెడుతున్నారా అంటూ నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. video

Next Story