- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రోడ్ నెట్‌వర్క్ చరిత్ర
రాష్ట్రంలో లక్ష కిలో మీటర్లకు పైగా రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రంగంలో ఎన్నడూలేని విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లక్ష కిలో మీటర్లకు పైగా రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రంగంలో ఎన్నడూలేని విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దేశంలోనే అగ్రగామి రోడ్ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ.. 2047 నాటికి రాష్ట్ర మొత్తం రోడ్ నెట్‌వర్క్‌ను 2.5 రెట్లు పెంచే లక్ష్యంతో సర్కారు ఒక దీర్ఘకాలిక ట్రాన్స్‌ఫార్మేటివ్ రోడ్ యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం ఉన్న 34,058 కిలో మీటర్ల రోడ్లను 53,102 కిలో మీటర్లకు పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 46,000 లేన్ కిలో మీటర్ల రోడ్ల సామర్థ్యాన్ని 1,15,000 లేన్ కిలో మీటర్లకు విస్తరించబోతున్నారు. ఇక రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ రూపొందించిన రోడ్ సెక్టార్ పాలసీ ప్రకారం రాబోయే 20 సంవత్సరాల్లో రోడ్ల సామర్థ్యం 46,000 లేన్ కిలో మీటర్ల నుంచి 1,15,000 లేన్ కిలో మీటర్లకు పెరుగుతుంది. ఇది రోడ్ల సంఖ్యను మాత్రమే కాదు, వాటి వాహన రవాణా సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఇది రవాణా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద విప్లవాత్మకమైన మార్పుగా మారబోనుంది.
రవాణా రూపాన్ని మార్చే ముఖ్య లక్ష్యాలు..
రాష్ట్ర రాజధాని నుండి అన్ని జిల్లా కేంద్రాలకు 4 లేదా 6 లైన్ కనెక్టివిటీ కల్పిస్తారు. ప్రతి జిల్లాను హైదరాబాదుతో వేగవంతమైన హైవే నెట్‌వర్క్ ద్వారా కలపనున్నారు. మండలాల మధ్య 2-లేన్ సురక్షిత రోడ్లు అందుబాటులోకి వస్తాయి. మండల కేంద్రాలను ఇతర ప్రధాన రోడ్లతో అనుసంధానం చేసి గ్రామీణ రవాణా శక్తిని పెంచుతారు. జాతీయ రహదారుల డెన్సిటీని కూడా పెంచుతారు. 2047 నాటికి జాతీయ రహదారుల సాంద్రతను ప్రతి 100 చదరపు కిలో మీటరుకు 7.06 కిలో మీటర్లకు పెంచనున్నారు. తద్వారా ప్రతి ప్రధాన పట్టణం వేగవంతమైన రహదారులపై ఆధారపడుతుంది.
హై-స్పీడ్ కారిడార్ల నెట్‌వర్క్..
హైదరాబాద్‌ను నాగ్‌పూర్, బెంగళూరు, చెన్నై, అమరావతి వంటి నగరాలతో కలుపుతూ హై-స్పీడ్ రోడ్ కారిడార్లు నిర్మించనున్నారు. వీటి నిర్మాణంతో ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకుని సమయం, లాజిస్టిక్ ఖర్చులు భారీగా తగ్గనుంది. సత్వర రవాణా, మెరుగైన హైవేల ద్వారా పరిశ్రమల రవాణా వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా వీటి నిర్మాణం చేపడుతున్నారు.
రోడ్డు భద్రతలో పెద్ద సంస్కరణల దిశగా అడుగులు..
బ్లాక్ స్పాట్‌ల తొలగింపు, రోడ్ సేఫ్టీ సెల్స్ ఏర్పాటు, ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాల అమలు చేపట్టనున్నారు. ఈ నిర్ణయాలన్నీ తెలంగాణలో రోడ్ల చరిత్రను మార్చే కీలక నిర్ణయంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రోడ్ల విస్తరణ వేగవంతంతో రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర రహదారులు అత్యంత ఆధునికంగా మారి అభివృద్ధికి బాటలు వేస్తాయని సర్కారు భావిస్తోంది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, పర్యటన తదితర రంగాల్లో రోడ్ నెట్‌వర్క్ కీలకంగా మారబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.






