- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో శరవేగంగా హైవేల నిర్మాణం.. పనుల పురోగతిపై కేంద్రం స్పష్టత
తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, ఎల్బీనగర్-మల్కాపూర్ రోడ్ విస్తరణ సహా 58 ప్రధాన ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రం స్పష్టతనిచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మౌలిక సదుపాయాల ముఖచిత్రాన్ని మార్చేలా జాతీయ రహదారుల(ఎన్‌హెచ్) నిర్మాణం శరవేగంగా సాగుతోంది. గత ఐదేళ్లలో మంజూరైన, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న 58 ప్రధాన ప్రాజెక్టుల భౌతిక, ఆర్థిక పురోగతిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. లోక్‌సభ వేదికగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కీలక వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న పనుల్లో కొన్ని పూర్తి కావొస్తుండగా, మరికొన్నింటికి భూసేకరణ, పర్యావరణ అనుమతులు అడ్డంకిగా మారాయని కేంద్రం స్పష్టం చేసింది.
కొనసాగుతోన్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్
హైదరాబాద్‌లోని ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ 50 శాతం పనుల పురోగతిని సాధించింది. ఇది ఆగస్టు 2027 నాటికి పూర్తి కావాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్-బీదర్ సెక్షన్(ఎన్‌హెచ్-161బి) పనులు 40 శాతం పూర్తయ్యాయి. అలాగే సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి నగరంలోని మదీనగూడ వరకు 6 వరుసల విస్తరణ పనులు 34శాతం పురోగతిలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ నుంచి చించోలి సెక్షన్ వరకు(కోస్గి, కొడంగల్, తాండూరు, వికారాబాద్ మీదుగా) (ఎన్‌హెచ్-167ఎన్) పనులు 91శాతం పూర్తి కావొచ్చాయి. నల్లగొండ బైపాస్ పనులు 23శాతం పురోగతిలో ఉండగా, అక్టోబర్ 2027 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖమ్మం-కురవి సెక్షన్ విస్తరణ పనులు ప్రారంభ దశలో(4శాతం) ఉన్నాయి.
ఎల్బీనగర్-మల్కాపూర్ 79శాతం పూర్తి
నగర శివార్లలో అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు ఉన్న రహదారి(ఎన్‌హెచ్-65) రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2020-21 వార్షిక ప్రణాళిక కింద చేపట్టిన ఈ రహదారి పునరుద్ధరణ, అప్‌గ్రేడేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 22.492 కి.మీ పొడవున సాగుతున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న రహదారిని 6 వరుసల ప్రధాన రహదారిగా విస్తరిస్తున్నారు. ఇరువైపులా సర్వీస్ రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు, అండర్ పాస్‌లను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 79శాతం పనులు పూర్తయ్యాయి. రహదారి వెంట ఉన్న కొన్ని ఆక్రమణల వల్ల పనుల వేగంపై ప్రభావం పడుతోంది. ఈ అడ్డంకులను అధిగమించి ఈ ఏడాది జూలై 31 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విస్తరణ పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడంతో పాటు రోడ్డు భద్రత మెరుగుపడనుంది.
పురోగతిలో జడ్చర్ల ఆర్వోబీ పనులు
జడ్చర్ల-కల్వకుర్తి మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు జడ్చర్ల పట్టణంలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) పనులు పురోగతిలో ఉన్నాయి. ఎన్‌హెచ్-167 సెక్షన్‌లో సుమారు కిలోమీటరు పొడవున ఈ 4 వరుసల ఆర్ఓబీని రూ.45.81 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది. 67 శాతం పనులు పూర్తయ్యాయి. రైల్వేశాఖ నుంచి రావాల్సిన క్లియరెన్స్‌లు, భూసేకరణ ప్రక్రియలో కొన్ని చిక్కులతో పనుల వేగంపై ప్రభావం పడుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు.
తుది దశకు కల్వకుర్తి-కొల్లాపూర్ సెక్షన్ పనులు
నాగర్‌కర్నూల్ జిల్లాలో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ చేపట్టిన కల్వకుర్తి-కొల్లాపూర్ సెక్షన్(ఎన్‌హెచ్-167కె) పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. 2021-22 వార్షిక ప్రణాళిక కింద నేషనల్ హైవే(ఓరియంటల్) పథకంలో భాగంగా ఈ రహదారి విస్తరణ పనులను కేంద్రం చేపట్టింది. సుమారు 79.3 కి.మీ పొడవున ప్రస్తుతం ఉన్న రహదారిని పేవ్డ్ షోల్డర్లతో కూడిన రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.886.69 కోట్లు కాగా, ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే కల్వకుర్తి-కొల్లాపూర్ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది.
ముగింపు దశకు హైదరాబాద్-భూపాలపట్నం పనులు
ములుగు జిల్లా పరిధిలోని హైదరాబాద్-భూపాలపట్నం ఎన్‌హెచ్-163 పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. 2021-22 వార్షిక ప్రణాళిక కింద సుమారు 39.7 కి.మీ మేర ఈ పనులు చేపట్టారు. 94 శాతం పనులు పూర్తయ్యాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో శాంతిభద్రతల సమస్యలు, కాంట్రాక్టర్ పనుల్లో జాప్యం వల్ల పురోగతి నెమ్మదించింది. ఈ నెలాఖరు వరకు పనులు పూర్తిగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
పనుల జాప్యానికి ప్రధాన కారణాలు
మెజారిటీ ప్రాజెక్టుల జాప్యానికి ప్రధాన కారణం భూసేకరణ ప్రక్రియలో జాప్యమని కేంద్రం గుర్తించింది. అటవీ శాఖ అనుమతులు రావడంలో ఆలస్యం కావడంతో కొన్ని సెక్షన్లలో పనులు నిలిచిపోయాయి. నిధుల కొరత, కాంట్రాక్టర్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో వేగం తగ్గింది. ముఖ్యంగా రుద్రంపూర్-భద్రాచలం సెక్షన్ పనులు కాంట్రాక్టర్ ఇబ్బందుల వల్ల టెర్మినేషన్ దశలో ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల కిందకు వచ్చే ములుగు వంటి ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్యల వల్ల పనులు నెమ్మదించాయి. మరోవైపు హైవే పనుల్లో నాణ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పారదర్శకమైన ఈ-టెండరింగ్, థర్డ్ పార్టీ క్వాలిటీ ఇన్స్‌పెక్షన్లు, డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్స్ వాడుతున్నారు. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లపై జరిమానాలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కొత్త ప్రాజెక్టులు..
నాగర్ కర్నూల్ జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఐకానిక్ హైబ్రిడ్ కేబుల్ స్టేడ్ అండ్ సస్పెన్షన్ బ్రిడ్జి ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఇది పూర్తయితే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం మరింత మెరుగుపడుతుంది. హైదరాబాద్ నుంచి నంద్యాల, తిరుపతి, కడప, చెన్నై వెళ్లేందుకు దగ్గరిదారి అవుతుంది. వెనకబడిన ప్రాంతాలైన కొల్లాపూర్, ఆత్మకూరు నియోజవర్గాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక తెలంగాణలోని వెనుకబడిన, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధిని పెంచడానికి ‘పీఎం గతి శక్తి’ నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్, వరంగల్-ఖమ్మం సెక్షన్, ఖమ్మం-దేవరపల్లి, అకల్కోట్-కర్నూల్ సెక్షన్, కరీంనగర్-వరంగల్, తదితర ప్రాజెక్టులు ఈ పథకం కింద చేపట్టారు.






