- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..
ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ,అభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అధికారులను ఆదేశించారు.

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ,అభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ గోడం నగేశ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుష, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో గత ఏడాది కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు, వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, భౌతిక, ఆర్థిక పురోగతి, పెండింగ్ పనులపై శాఖల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, పంచాయతీరాజ్, వ్యవసాయం, ఐటిడిఏ, విద్యుత్, వైద్య ఆరోగ్యం, విద్య, మహిళా, శిశు సంక్షేమం, ఉద్యానవనం, అటవీ, గిరిజన సంక్షేమం, క్రీడలు, పౌర సరఫరాలు, బీఎస్ఎన్ఎల్, జాతీయ రహదారులు, లీడ్ బ్యాంక్ తదితర శాఖల పనితీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర నిధులతో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యానికి తావులేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. గత సమావేశం అనంతరం పనుల్లో పురోగతి కనిపించిందని, ప్రస్తుతం వర్కింగ్ సీజన్ కావడంతో లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనం, అల్పాహార కార్యక్రమాలు నాణ్యంగా అమలయ్యేలా చూడాలని సూచించారు.
ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు
ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ సమావేశం నిర్వహించి జిల్లాలోని సమస్యలను సమీక్షించి పరిష్కరించాలని తెలిపారు.ప్రతి శాఖ పనితీరును విడివిడిగా సమీక్షించి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ కింద అర్హులైన ప్రతి జాబ్‌కార్డు దారుకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్లు, అటవీ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, రేషన్ బియ్యం పారదర్శకంగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..ఉపాధి హామీ పనుల్లో సమాన పని దినాలు, సమాన వేతనం అమలు చేయాలని సూచించారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడడంతో పాటు రైతులకు యూరియా యాప్ వినియోగంపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్నచోట పరిష్కారం చూపాలని, నిర్మాణాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదకర బ్లాక్‌స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్‌డీవో రాథోడ్ రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






