ఉన్నత విద్యలో విప్లవాత్మక శక్తిగా జనరేటివ్ ఏఐ .. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కిష్టారెడ్డి

by Ramesh Naini |

ప్రపంచంలో (Generative AI) జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేధస్సు) నేర్చుకునే, బోధించే, ఆవిష్కరించే విధానాన్ని మారుస్తూ విప్లవాత్మక శక్తిగా నిలుస్తుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి అన్నారు.

ఉన్నత విద్యలో విప్లవాత్మక శక్తిగా జనరేటివ్ ఏఐ .. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కిష్టారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేడు వేగంగా మారుతున్న విద్యా ప్రపంచంలో (Generative AI) జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేధస్సు) నేర్చుకునే, బోధించే, ఆవిష్కరించే విధానాన్ని మారుస్తూ విప్లవాత్మక శక్తిగా నిలుస్తుందని (Higher Education Council) తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) కార్యాలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున ప్రచురితమైన అంతర్జాతీయ జర్నల్ ప్రత్యేక సంచికను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలి వైస్‌చైర్మన్‌లు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్.కె. మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ, కంటెంట్ సృష్టి, పరిశోధన సంశ్లేషణతో పాటు అభ్యసన అంతరాలను తగ్గించడంలో, బహుళ విషయాల సహకారాన్ని ప్రోత్సహించడంలో కూడా ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే, సాంకేతికత మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాకుండా తోడ్పాటునిచ్చేలా చూడటానికి నైతిక పాలన, డిజిటల్ అక్షరాస్యత, ఏఐ సాధనాల బాధ్యతాయుతమైన వినియోగం అవసరమని ఆయన ఉద్ఘాటించారు.

40 పరిశోధన పత్రాలు:

గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి సంపాదకత్వంలో ఈ ప్రత్యేక సంచిక ప్రచురించబడింది. సహ సంపాదకులుగా హన్మకొండ కాకతీయ ప్రభుత్వ కళాశాల (అటానమస్) నుండి అసోసియేట్ ప్రొఫెసర్లు డా.ఇ. రామ్ భాస్కర్ రాజు, డా.టి.యుగంధర్, గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జె. శ్రావణ్ కుమార్ పనిచేశారు. ఈ సంచికలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 40 పరిశోధన పత్రాలు ఉన్నాయి. ఇంతటి గణనీయమైన ఇంపాక్ట్ ఫ్యాక్టర్‌తో అంతర్జాతీయ జర్నల్ ప్రత్యేక సంచికను విజయవంతంగా ప్రచురించినందుకు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి, సంపాదక బృందాన్ని చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన ఆధారిత పత్ర సమర్పణలతో ముందుకు సాగడానికి ఉన్నత విద్యా మండలి నిరంతర మద్దతును అందిస్తుందని ఆయన తెలిపారు.

Next Story