బస్ భవన్ వద్ద టెన్షన్.. టెన్షన్.. ఆర్టీసీ జేఏసీ నేత థామస్ రెడ్డిని రౌండప్ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు

by Prasad Jukanti |   (  Updated:2026-06-18 12:00:49  IST  )

బస్ భవన్ వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనియన్ నేత థామస్ రెడ్డిని రిటైర్డ్ ఉద్యోగులు అడ్డగించి నిలదీశారు.

బస్ భవన్ వద్ద టెన్షన్.. టెన్షన్.. ఆర్టీసీ జేఏసీ నేత థామస్ రెడ్డిని రౌండప్ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ సమస్యల పరిష్కారించాలని గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్‌భవన్‌ ఎదుట ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన టెన్షన్‍గా మారింది. ఆర్టీసీ యూనియన్ నాయకుడు థామస్ రెడ్డిని రౌండప్ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు.. మీవల్లే మాకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. రిటైర్మెంట్ ఉద్యోగులను రోడ్డుమీదకు తీసుకువచ్చిన థామస్ రెడ్డి ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిస్టమ్, ప్రైవేట్ బస్సులు ఇవన్నీ జేఏసీ నాయకుల వల్లే వస్తున్నాయని ఆరోపించారు. యునియన్‍లో ఉన్న వారంతా రిటైర్మెంట్ అయినవారేనని వారు అటు రిటైర్మెంట్ ఉద్యోగుల వైపైనా ఉండాలి లేదా సర్వీసు ఉద్యోగుల వైపైనా ఉండాలి తప్ప మమ్మల్ని అడ్డుపెట్టుకుని దండుకోవద్దన్నారు. గుర్తింపు సంఘాల పేరుతో ఎన్నికలు నిర్వహించి కార్మికుల వద్ద డబ్బులు దండుకోవడం కోసమే జేఏసీ నాయకులు వస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వం కోసమే విలీనం:

ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం పరం చేసేందుకే ఆర్టీసీ విలీనం చేస్తున్నారని విలీనాన్ని రిటైర్మెంట్ కార్మికులమంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ ఆస్తి అంతా తాము చేసిన సర్వీస్ ఫలితమే అన్నారు. తాము కార్పొరేషన్ డబ్బులు అడగడం లేదని మేము జమ చేసుకున్న మా డబ్బులు మాకు ఇవ్వమని మాత్రమే అడుగుతున్నామన్నారు. ఒక్కొక్క రిటైర్డ్ ఉద్యోగికి 5-10 లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. రిటైర్డ్ అయి నాలుగేళ్లు అవుతున్నా మా డబ్బులు మాకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తే చిత్తుగా ఓడించి ఇంటికి పంపించామని ఇప్పుడు రేవంత్ రెడ్డి నమ్మించి గొంతుకోస్తున్నారని మండిపడ్డారు. మహిళలను కోటీశ్వరులను చేయడం కాదు రేవంత్ రెడ్డి కుటుంబమే కోటీశ్వరులుగా తయారవుతోందని విమర్శించారు. మహాలక్ష్మీ పథకం నడవడానికి ప్రధాన కారణం రిటైర్డ్ ఉద్యోగుల వాటా కూడా ఉందన్నారు. ఆర్పీఎస్‌ 2017, 2021 ఏరియర్స్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంటు, గ్రాట్యుటీ బకాయిలు తదితర ఎన్నో సమస్యలు ఉన్నట్టు వాపోయారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందనలేదని, అందుకే ఇవాళ దీక్ష చేపట్టామన్నారు.

Next Story