టైగర్.. హైటెక్ ట్రాకింగ్.. ఆడ తోడు కోసం వచ్చిందా?

by Naga Rani Yarlagadda |

పెద్దపులిని పట్టుకునేందుకు అధికారులు సాయశక్తులా ప్రశ్నిస్తున్నారు. పెద్దపులితో ఆటలొద్దని గ్రామాల ప్రజలను హెచ్చరిస్తున్నారు.

టైగర్.. హైటెక్ ట్రాకింగ్.. ఆడ తోడు కోసం వచ్చిందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పులుల సంచారం జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. దీంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ముఖ్యంగా కరీంనగర్, సిద్దిపేట, జనగామ మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన ఒక పులి సుమారు 300 కి.మీ. ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. అసలు పులులు ఎందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి? కేవలం ఆహారం కోసమే అడవుల నుంచి బయటకు వస్తున్నాయా? గతంతో పోలిస్తే ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిందా? పులుల జీవనశైలి, అటవీశాఖ నిఘా విధానాలు, ప్రజలు పాటించాల్సిన రక్షణ పద్ధతులపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

పొరుగు రాష్ట్రాల నుంచి సంచారం

ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్(ఏఐటీటీ) 2026 విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 45 నుంచి 55 మధ్య పులులు ఉండగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోనే అత్యధికంగా 42 పులులు ఉన్నాయని అటవీశాఖ చెబుతోంది. ఇక కవ్వాల్, ఉత్తర తెలంగాణలో 5 నుంచి 8 పులులు సంచరిస్తున్నాయని, ఇవి ప్రధానంగా పొరుగు రాష్ట్రాల అడవుల నుంచి రాష్ట్రానికి వలస వస్తుంటాయని ఏఐటీటీ పేర్కొంది. మహారాష్ట్ర కారిడార్.. తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యాల నుంచి పులులు ప్రాణహిత, పెన్‌గంగా నదిని దాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. ఛత్తీస్‌గఢ్ కారిడార్.. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అడవుల్లోకి పులుల రాకపోకలు ఉంటాయి. కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, జనగామలో సంచరిస్తున్న పులి తడోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ మీదుగా వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పులి ఒంటరి జీవి

పులి సహజ జీవనశైలిని పరిశీలిస్తే ఒంటరి జీవి. సింహాల మాదిరిగా ఇవి గుంపులు గుంపులుగా ఉండవు. ఒక పులికి తన మనుగడ కోసం కనీసం 60 నుంచి 100 చదరపు కి.మీ. ప్రాంతం అవసరం. అడవిలో పులుల సంఖ్య పెరిగినప్పుడు బలమైన పెద్ద పులులు యంగ్ పులులను బయటికి తరిమేస్తాయి. తల్లి నుంచి విడిపోయిన మూడు, నాలుగేళ్లకు పైబడిన పులి ఇతర పులుల ఆధిపత్యంలేని తనకంటూ ఒకకొత్త ప్రాంతాన్ని వెతుక్కుంటూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనినే ‘డిస్పర్సల్’ అని పిలుస్తుంటారు. ఇప్పుడు కరీంనగర్, సిద్దిపేటతో పాటు సుమారు హైదరాబాద్ వరకు అంటే తూంకుంట వరకు పులి వచ్చినట్లు సమాచారం. అది తన సొంత సామ్రాజ్యాన్ని వెతుక్కుంటూ రాష్ట్రంలోకి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఆడ తోడు కోసం వచ్చిందా?

ఇటీవల తరుచూ కనిపిస్తున్న జే1 ఆడ పులి కోసం వెతుకుతూ అది జనావాసాల్లోకి వచ్చిందనే వాదనలో శాస్త్రీయత లేదు. ఎందుకంటే.. పులి ముందుగా తనకు రక్షణగా ఉండే ‘టెరిటరీ’ని నిర్మించుకుంటుంది. అక్కడ తగినంత ఆహారం, నీరు ఉంటేనే అది ఆడ పులిని ఆకర్షించగలదని వైల్డ్ లైఫ్ నిపుణులు పేర్కొంటున్నారు. పులులు ఉన్న ప్రాంతం(అమ్రాబాద్ లేదా కవ్వాల్) వైపు వెళ్లకుండా అసలు పులులే లేని జనగామ, సిద్దిపేట వైపు రావడాన్ని బట్టి ఇది కేవలం సొంత నివాసం కోసం చేస్తున్న అన్వేషణ మాత్రమేనని స్పష్టమవుతున్నది.

అటవీశాఖ ట్రాకింగ్

అటవీశాఖ అధికారులు పులిని పట్టుకోవడానికి లేదా దాని కదలికలను ఇలా ట్రాక్ చేస్తున్నారు.

1.M-STrIPES యాప్ : ఫీల్డ్ స్టాఫ్.. పులి అడుగుజాడలను ఫొటోతీసి జీపీఎస్ లొకేషన్‌తో ఈ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇది పులి ప్రయాణ మార్గాన్ని నిర్ధారిస్తుంది. దీంతో పాటు ఫారెస్టు అధికారుల పెట్రోలింగ్ ప్రక్రియ సైతం నమోదవుతుంది.

2. థర్మల్ డ్రోన్లు(DJI Mavic 3T/Matrice 30T) : ఇవి జంతువుల శరీర వేడిని గుర్తిస్తాయి. దట్టమైన పొదల్లో లేదా రాత్రివేళల్లో పులి ఎక్కడ దాక్కుందో వీటి ద్వారా స్పష్టంగా చూడొచ్చు.

3. కెమెరా ట్రాప్స్ : పులి సంచరించే మార్గాల్లో చెట్లకు కదలికలను గుర్తించే కెమెరాలు అమర్చి దాని చారలను బట్టి అది ఏ పులి అని ధ్రువీకరిస్తారు. ఈ డ్రోన్లు అమ్రామాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్(కేటీఆర్)ప్రాంతాల్లో ఉన్నాయి.

ఏఐ ఈ-సర్వైలెన్స్

అమ్రామాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్(కేటీఆర్)ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఆధారిత ఆన్‌లైన్ ఈ సర్వైలెన్స్ ద్వారా జంతువుల కదికలను గుర్తించనున్నారు. ఈ సమాచారం ఆధారంగా స్థానిక టైగర్ సెల్ తీసుకుని అక్కడి నుంచి ఇంటర్ నెట్ ద్వారా అరణ్యభవన్‌లోని టైగర్ మానిటరింగ్ సెల్‌కు చేరవేయనున్నారు.

పులితో పెట్టుకోవద్దు

- పొలాలకు లేదా అటవీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కనీసం ముగ్గురు లేదా నలుగురు కలిసి వెళ్లాలి. పెద్దగా శబ్దం చేస్తూ లేదా పాటలు పాడుతూ వెళ్లడం వల్ల పులి భయపడి దూరంగా వెళ్తుంది.

- పులి రాత్రిపూట చాలా చురుగ్గా ఉంటుంది. పొలాల వద్ద నిద్రించడం లేదా ఒంటరిగా నడవడం మానుకోవాలి.

- పులి ఒక పశువును చంపినట్లు తెలిస్తే దానిని చూడటానికి గుంపులుగా వెళ్లకండి. దాచిన ఆహారం కోసం పులి మళ్లీ అక్కడి వచ్చే అవకాశం ఉంటుంది.

- పులి కనిపిస్తే దానిని వెంబడించడం, రాళ్లతో కొట్టడం లేదా సెల్ఫీలు దిగడం వంటి పనులు ప్రాణాంతకం.

Next Story