స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన ఆదేశాలు.. సెప్టెంబర్ 30 డెడ్‌లైన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-25 06:03:18  IST  )

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించనుంది.

స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన ఆదేశాలు.. సెప్టెంబర్ 30 డెడ్‌లైన్
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్‌ టి.మాధవి దేవి ఇవాళ స్థానిక ఎన్నికల నిర్వహణపై తుది తీర్పును వెలువరించారు. 30 రోజుల్లో వార్డు విభజన చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని డెడ్‌లైన్ విధించారు. అయితే, విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది స్థానిక ఎన్నికల నిర్వహణకు 30 రోజలు గడువు కోరారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల సమయం కోరింది. పూర్తి వాదనలు విన్న జస్టిస్ టి.మాధవి దేవి సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు.

గ్రామాల్లో పాలన పడకేసింది.. పటిషనర్ల తరఫు లాయర్

స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాదిన్నర అయినా ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. గతేడాది జనవరి 31తో ఆయా పంచాయతీల్లో పాలకవర్గా పదివీ కాలం ముగిసినా.. ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను పాలనా బాధ్యతలు అప్పగించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రామాలు సమస్యలకు కేంద్ర బిందువుగా మారాయని, అభివృద్ధి పూర్తిగా కుంటుబడుతోందని ధర్మాసనానికి విన్నవించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు నిధులు రాకపోయినా చాలా మంది సర్పంచ్‌లు తమ సొంత డబ్బుతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేశారని.. ఇప్పుడు బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని లేని పక్షంలో స్పెషల్ ఆఫీసర్ల స్థానంలో పాత పాలకవర్గాలకే తిరిగి పంచాయతీ పాలనా వ్యవహారాలను అప్పగించాలని మాజీ సర్పంచ్‌ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

కనీసం 60 రోజుల సమయం అవసరం.. రాష్ట్ర ఎన్నిక సంఘం

ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ తన వాదనాలు వినిపిస్తూ... సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదని అందుకు మరో నెల రోజుల గడువు కావాలని అభ్యర్థించారు. అనంతరం ఎన్నికల సంఘం తరఫున అడ్వొకేట్ విద్యాసాగర్‌ తన వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఆ పక్రియ పూర్తి అవ్వగానే తమ పని తాము చేసేస్తామని తెలిపారు. రాష్ట్ర సర్కార్ స్థానిక ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పాక.. ఎలక్షన్ తంతు పూర్తి చేసేందుకు కనీసం 60 రోజులు సమయం పడుతోందని అన్నారు. కేసులో పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి టి.మాధవి దేవి సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశలు జారీ చేశారు.

Next Story