- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG High Court: ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు? సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు (Local Body Elections) నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు (High Court) ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం (Telangana Government) ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదన్న నిలదీసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నల్గొండ జిల్లా మాజీ సర్పంచ్ లతో పాటు దాఖలైన మొత్తం ఆరు పిటిషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 2024 ఫిబ్రవరి 1వ తేదీతో తెలంగాణలో సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిపోగా ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం 2024 జులై 5తో పూర్తయింది. నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని తెలంగాణ హైకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలు కాగా వీటిపై ఇదివరకు సైతం వాదనలు జరిగాయి. తాజాగా ఇవాళ మరోసారి విచారణకు రాగా పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వాదనలు పూర్తి కావడంతో స్థానిక సంస్థలపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
30 రోజుల గడువివ్వండి:
విచారణ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజులు, ఎన్నికల సంఘం (State Election Commission) 60 రోజుల పాటు గడువు కావాలని హైకోర్టును కోరాయి. రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ పూర్తి కావడానికి ప్రభుత్వం గడువు కోరగా ప్రభుత్వం వైపు నుంచి క్లియరెన్స్ వస్తే ఎన్నికలు నిర్వహించేందుకు తమకు రెండు నెలల పాటు సమయం కావాలని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. అయితే గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎన్నికల నిర్వహణ విషయంలో గత విచారణలోనే చెప్పినట్లుగా ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఆగస్టు తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు:
అయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమయాత్తం అవుతున్నదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు పూర్తి చేస్తున్నాయి. ఎన్నికల విషయంలో మంత్రులు సైతం వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. అయితే కులగణన, బీసీల రిజర్వేషన్ అంశం సైతం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ చేసిన తీర్పులో ఏముంది? ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ కానున్నాయనేది సస్పెన్స్ గా మారింది. ప్రభుత్వం, ఈసీ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు తర్వాతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.






