రేపే బిగ్ డే: కాళేశ్వరం 'ఘోష్' కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు.. రాజకీయ వర్గాల్లో నరాలు తెగే ఉత్కంఠ!

by Gantepaka Srikanth |

తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై రేపు (బుధవారం) రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది.

రేపే బిగ్ డే: కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు.. రాజకీయ వర్గాల్లో నరాలు తెగే ఉత్కంఠ!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై రేపు (బుధవారం) రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించబోతుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వివరాల్లోకి వెళితే.. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నివేదికను రద్దు చేయాలని కోరుతూ గతంలో కీలక నేతలు, అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు వేసిన వారిలో కేసీఆర్ (మాజీ ముఖ్యమంత్రి), హరీష్ రావు (మాజీ మంత్రి), స్మితా సబర్వాల్ (ఐఏఎస్ అధికారిణి), ఎస్‌కే జోషి ఉన్నారు. తమ వాదనలు వినకుండా లేదా ఏకపక్షంగా ఈ నివేదిక రూపొందించబడిందని, కావున దీనిని రద్దు చేయాలని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై గత కొన్ని రోజులుగా హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపు న్యాయవాదులు, పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసింది. రేపు ఈ తీర్పును వెల్లడించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

రాజకీయ ప్రాధాన్యత..

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుండగా, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఒకవేళ కోర్టు నివేదికను సమర్థిస్తే పిటిషనర్లకు ఇబ్బందులు తప్పవు. ఒకవేళ నివేదికలో లోపాలు ఉన్నాయని కోర్టు భావిస్తే, అది విచారణ ప్రక్రియకు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. రేపు వెలువడనున్న ఈ తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యాన్ని, దీనితో సంబంధం ఉన్న కీలక నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Next Story