కాళేశ్వరం రిపోర్టు రద్దుకు నో చెప్పిన హైకోర్టు.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో గులాబీ బాస్

by Kema Shiva Kumar |

కాళేశ్వరంపై బీఆర్ఎస్ పార్టీ రివర్స్ గేర్ వేసినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం రిపోర్టు రద్దుకు నో చెప్పిన హైకోర్టు.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో గులాబీ బాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరంపై బీఆర్ఎస్ పార్టీ రివర్స్ గేర్ వేసినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని, అంతా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నామని బల్లగుద్ది చెప్పిన గులాబీ లీడర్లు, ఇప్పుడు కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని డిమాండ్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రిపోర్టు బహిర్గతం అయితే అసలు గుట్టు బయట పడుతుందనే భయంతోనే గులాబీ నేతలు కోర్టు మెట్లు ఎక్కారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి అవకతవకలు జరగలేదని పదే పదే చెబుతోన్న గులాబీ పార్టీ విచారణను ఎదుర్కొనేందుకు ఎందుకు జంకుతోందని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

కమిషన్‌పై ద్వంద్వ విధానాలు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎంక్వైరీలు వేసినా తమకు ఇబ్బంది లేదని బీఆర్ఎస్ లీడర్లు పలు సార్లు ప్రకటించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు స్వయంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ హాజరయ్యారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కానీ, కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిన తరువాత మాట మార్చడం(రివర్స్ గేర్)పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కమిషన్ ఏర్పాటు సమయంలోనే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు? మరి కమిషన్ విచారణకు ఎందుకు హాజరయ్యారు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అంతా జరిగిపోయిన తరవాత ఇప్పుడు కమిషన్‌పై రాజకీయ రంగు పులమడం(ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక) ఇచ్చారనే వాదన సరికాదనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.

విచారణ భయం?

కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో టేబుల్ చేసి పూర్తి స్థాయిలో చర్చించిన తరువాత అన్ని పార్టీల అభిప్రాయంతో ముందుకు వెళ్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పోలీసు విచారణ చేపట్టేందుకు సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం) ఏర్పాటు చేయాలా.. లేక సీఐడీకి అప్పగించాలా? అనే అంశంపై సభ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ, రిపోర్టు బయటకు వస్తే అసలు గుట్టు వీడుతుందనే భయంతోనే గులాబీ లీడర్లు న్యాయపోరాటం పేరుతో అడ్డుపడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పు జరగలేదని బలంగా చెబుతున్న నాయకులు, విచారణ సంస్థల ముందు హాజరై తమ వాదనలు వినిపించేందుకు ఎందుకు జంకుతున్నారు? తమ తప్పులు బయటకు రాకుండా ఉండేందుకే కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

సుప్రీంకు వెళ్లే యోచన..

కమిషన్ రిపోర్టును రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీనితో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం పలువురు సుప్రీం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తరువాత విచారణ సంస్థలకు అప్పగిస్తే కేసీఆర్, హరీశ్‌లకు ఇబ్బందులు తప్పవు. ఇరువురు విచారణ సంస్థలు ఎప్పుడు పిలిచినా వెళ్లాల్సి ఉంటుంది. పదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన కేసీఆర్ అపోజిషన్ లీడర్‌గా అసెంబ్లీకి వెళ్లేందుకు అయిష్టంగా ఉన్నారని, అందుకే సభలో జరిగే చర్చలకు అటెండ్ కావడం లేదని విమర్శలు ఉన్నాయి. కానీ అదే కేసీఆర్ భవిష్యత్‌లో ఐపీఎస్ లేదా డీఎస్పీ ర్యాంకు హోదాలో ఉన్న అధికారి విచారణకు (సీఐడీ లేదా సిట్ విచారణ) వెళ్లక తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Next Story