- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు ఊరట..
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు ఆయను జైలు నుంచి విడుదల చేయనున్నారు. గత నెల మార్చి 14వ తేదీ రాత్రి మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న పార్టీపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో కొకైన్, భారీగా మద్యం సీసాలతో పాటు ఒక తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో పార్టీలో పాల్గొన్న మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఆరుగురికి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.
నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నిర్వహించడం, మత్తు పదార్థాల వినియోగం, తుపాకీ వాడకం తదితర తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని మార్చి 14నే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాటి నుంచి ఆయన నెల రోజులకు పైగా చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కింది కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికావడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఎట్టకేలకు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల కాపీ జైలు అధికారులకు చేరిన వెంటనే రోహిత్ రెడ్డిని జైలు నుంచి విడుదల చేయనున్నారు.






