TG: యుద్ధం చేస్తున్నారా?.. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

by Gantepaka Srikanth |

అమీన్‌పూర్ కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు, హైడ్రా (HYDRAA) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

TG: యుద్ధం చేస్తున్నారా?.. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: అమీన్‌పూర్ కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు, హైడ్రా (HYDRAA) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన ధర్మాసనం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవని, అవి యుద్ధాన్ని తలపిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులు ఇవ్వకుండా, నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడం సరికాదని తప్పుబట్టింది. హైడ్రా ఏర్పాటై ఏడాది దాటినా ఇప్పటివరకు దానికి నిర్దిష్టమైన విధివిధానాలు లేకపోవడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గైడ్ లైన్స్ లేకుండా చర్యలు తీసుకోవడాన్ని ప్రశ్నించింది. చెరువులు, రోడ్లు, పార్కులు ఆక్రమిస్తే కచ్చితంగా కూల్చివేయాలని, అయితే ఆ ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలని కోర్టు పేర్కొంది. బాధితులకు ముందస్తు నోటీసులు ఇచ్చి, వారి వివరణ తీసుకున్న తర్వాతే చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ ముగిసే వరకు, కోర్టు నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హైడ్రా తన కార్యకలాపాలను, ముఖ్యంగా కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశించింది.

Next Story